Telugu Global
National

కమలానికి చీపురు దెబ్బ.. ఎంపీలో ఎంట్రీ

బీజేపీ అభ్యర్థి చంద్ర ప్రతాప్ విశ్వకర్మపై 9,352 ఓట్ల మెజార్టీతో ఆమె విజయం సాధించారు. ఇక్కడ కాంగ్రెస్ మూడో స్థానంలో నిలిచింది.

కమలానికి చీపురు దెబ్బ.. ఎంపీలో ఎంట్రీ
X

కాంగ్రెస్ నుంచి ఢిల్లీలో అధికారాన్ని లాగేసుకున్న ఆమ్ ఆద్మీ పార్టీ, ఆ తర్వాత మళ్లీ కాంగ్రెస్ నుంచే పంజాబ్ ని కైవసం చేసుకుంది. ఈసారి ఆ పార్టీ బీజేపీ అధికారంలో ఉన్న మధ్యప్రదేశ్ ని ఫోకస్ చేసినట్టుంది. మధ్యప్రదేశ్ మున్సిపల్ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ సింగ్రౌలి మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ పదవిని కైవసం చేసుకుంది. ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన రాణి అగర్వాల్ మేయర్ అభ్యర్థిగా విజయం సాధించారు. బీజేపీ అభ్యర్థి చంద్ర ప్రతాప్ విశ్వకర్మపై 9,352 ఓట్ల మెజార్టీతో ఆమె విజయం సాధించారు. ఇక్కడ కాంగ్రెస్ మూడో స్థానంలో నిలిచింది.

మేయర్ పదవి మాత్రమే..

విచిత్రం ఏంటంటే.. సింగ్రౌలి కార్పొరేషన్లో బీజేపీ అత్యధిక కార్పొరేటర్లను గెలుచుకుంది. 45 స్థానాలున్న సింగ్రౌలి కార్పొరేషన్లో బీజేపీ 23, కాంగ్రెస్ 12, ఆప్ 5, బీఎస్పీ 2, ఇండిపెండెంట్లు 3 స్థానాల్లో గెలిచారు. ఇక్కడ మేయర్ అభ్యర్థిగా ఆప్ నుంచి పోటీ చేసిన రాణి అగర్వాల్ గెలవడం విశేషం. మధ్యప్రదేశ్ లో ఎన్నికలు జరిగిన 11 కార్పొరేషన్లలో ఏడుచోట్ల బీజేపీ మేయర్ పదవుల్ని సొంతం చేసుకుంది. గతంలో బీజేపీ గెలిచిన రెండు చోట్ల ఇప్పుడు కాంగ్రెస్ పాగా వేసింది. కొత్తగా ఆమ్ ఆద్మీ పార్టీ కూడా బోణీ కొట్టింది. దీంతో బీజేపీ హవాకి గండిపడినట్టయింది.

మేయర్ గా గెలుపొందిన రాణి అగర్వాల్ సింగ్రౌలి స్థానం నుంచి 2018 అసెంబ్లీకి పోటీ చేసి ఓడిపోయారు. మూడో స్థానంలో నిలిచారు. అంతకు ముందు ఆమె బార్గవాన్ గ్రామపంచాయతీ నుంచి సర్పంచ్ గా గెలిచారు. ఇప్పుడు మేయర్ గా ఎన్నికై బీజేపీకి షాకిచ్చారు. మధ్యప్రదేశ్ లో ఆప్ కు ఘనమైన ఎంట్రీ ఇచ్చారు. సింగ్రౌలీ మేయర్ ఎన్నికల్లో గెలుపొంది రాణి అగర్వాల్‌ కు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అభినందనలు తెలిపారు. ఇప్పుడు దేశంలోని ప్రతి మూలలో ప్రజలు నిజాయితీ రాజకీయాలను ఇష్టపడుతున్నారని ఆయన పేర్కొన్నారు. కేజ్రీవాల్ కూడా సింగ్రౌలిలో అగర్వాల్ కోసం ప్రచారం చేశారు. అగర్వాల్‌ తో కలిసి రోడ్ షో నిర్వహించారు. ఇటీవల వివిధ అసెంబ్లీలకు జరిగిన ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికల్లో జోరుమీదున్న బీజేపీకి మధ్యప్రదేశ్ లో మాత్రం పరిస్థితులు కాస్త ఎదురు తిరిగాయి. కమలం ఆధిపత్యానికి గండి కొట్టాయి.

First Published:  18 July 2022 1:52 AM GMT
Next Story