పుట్టిన వెంటనే ఆధార్.. ఐదేళ్లకు బయోమెట్రిక్..
పుట్టిన పిల్లలకు బర్త్ సర్టిఫికెట్ తో పాటు, ఆధార్ కార్డ్ కూడా వెంటనే అందుబాటులోకి వచ్చేస్తుంది. అయితే ఈ కార్డుల్లో వారి వేలి ముద్రలు, కనుపాపలకు సంబంధించి ఐరిస్ వివరాలు ఉండవు.
పుట్టిన పిల్లలకు వెంటనే ఆధార్ నంబర్ జనరేట్ అయ్యేలా కేంద్రం కొత్త రూల్స్ తీసుకొచ్చింది. ప్రస్తుతం 16 రాష్ట్రాల్లో ప్రయోగాత్మకంగా అమలులో ఉన్న ఈ విధానాన్ని త్వరలో దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో అధికారికంగా అమలు చేయబోతోంది. అంటే పుట్టిన పిల్లలకు బర్త్ సర్టిఫికెట్ తో పాటు, ఆధార్ కార్డ్ కూడా వెంటనే అందుబాటులోకి వచ్చేస్తుందనమాట. అయితే ఈ కార్డుల్లో వారి వేలిముద్రలు కానీ, కనుపాపలకు సంబంధించి ఐరిస్ వివరాలు కానీ ఉండవు. ఐదేళ్ల తర్వాతే వేలి ముద్రలు, ఐరిస్ సేకరించి కార్డుకి అనుసంధానిస్తారు.
తెలంగాణతోపాటు మరో 15 రాష్ట్రాల్లో గతేడాది నుంచి ఈ విధానం ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నారు. దీనివల్ల ఎలాంటి ఇబ్బందులు లేవు, పైగా ఇది రేషన్ కార్డ్, ఎల్ఐసీ వంటి అవసరాలకు బాగా ఉపయోగపడుతోంది. పిల్లల్ని స్కూల్ లో జాయిన్ చేసేటప్పుడే వారి ఆధార్ కూడా జత చేస్తున్నారు. దీనివల్ల ప్రయోజనాలు ఉన్నాయనే నమ్మకంతో దేశవ్యాప్తంగా దీన్ని అమలులోకి తెస్తున్నారు.
ప్రస్తుతం దేశవ్యాప్తంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాల్లో ఆధార్ తప్పనిసరి చేశారు. వెయ్యికి పైగా పథకాలకు దరఖాస్తు చేసుకోవాలంటే ఆధార్ కార్డ్ ఉండాల్సిందే. అందుకే ఆధార్ కి అంత ప్రయారిటీ ఇస్తున్నారు. ఈ క్రమంలోనే కేంద్రం తాజా నిర్ణయం తీసుకుంది. పుట్టిన పిల్లలకు ఆధార్ ఇచ్చినా 5 నుంచి 15 ఏళ్ల లోపు వారు తమ బయోమెట్రిక్ ని అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 134 కోట్ల ఆధార్ కార్డులను జారీ చేసినట్లు కేంద్రం తెలిపింది. గత ఏడాది కొత్తగా దరఖాస్తు చేసుకున్నవారు, ఆధార్ అప్ డేట్ చేసుకున్నవారు మొత్తం 20కోట్లమంది ఉన్నారు. పుట్టిన పిల్లలకు కూడా ఆధార్ ఇవ్వాలన్న నిర్ణయంతో ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశముంది.