యువతిపై దాడికి పాల్పడ్డ ప్రేమోన్మాది భరతం పట్టిన మధ్యప్రదేశ్ సీఎం
ప్రేమించిన ప్రియుడ్ని పెళ్లి చేసుకోమని కోరడమే ఆ యువతి చేసిన పాపం.. నడిరోడ్డుపై ప్రియుడు ఆమెను చితకబాదాడు. అతడు తన ప్రియురాలిని చావబాదుతుంటే ఆపే ప్రయత్నం చేయకుండా అతని స్నేహితుడు వీడియో తీశాడు. ఆ వీడియో మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ వరకు వెళ్లడంతో యువతిపై దాడికి పాల్పడ్డ యువకుడి భరతం పట్టారు. రెవాలోని మౌగంజ్ కు చెందిన పంకజ్ త్రిపాఠి ఓ యువతితో ప్రేమలో ఉన్నాడు. కొద్ది రోజులుగా ఆ యువతి తనను పెళ్లి చేసుకోవాలని ప్రియుడిని కోరుతూ వచ్చింది. తాజాగా ఆ యువతి మరోసారి ఈ ప్రస్తావన తీసుకురాగా నడిరోడ్డు అని చూడకుండా పంకజ్ త్రిపాఠి అనే యువకుడు తన ప్రియురాలిని కిందపడేసి కాలితో తన్ని, విపరీతంగా కొట్టాడు.
అతడు ఎంతగా దాడికి పాల్పడ్డాడంటే ఆ యువకుడు కొట్టిన దెబ్బలకు యువతి స్పృహ కూడా కోల్పోయింది. ఈ తతంగం జరుగుతున్న సమయంలో అక్కడే ఉన్న త్రిపాఠి స్నేహితుడు సెల్ ఫోన్ లో వీడియో తీశాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అది మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ దృష్టికి వెళ్ళింది. దీంతో ఆయన వెంటనే ప్రేమోన్మాదిపై చర్యలు చేపట్టారు. అధికారులు ఒక బుల్డోజర్ తీసుకెళ్లి పంకజ్ త్రిపాఠి ఇంటిని కూల్చివేశారు. ఇల్లు ఎందుకు కూల్చి వేశారు అని అడిగిన వారికి అక్రమ కట్టడం అని.. అందువల్లే కుల్చేశామని అధికారులు సమాధానం ఇచ్చారు. త్రిపాఠి డ్రైవింగ్ లైసెన్స్ కూడా అధికారులు రద్దు చేశారు.
మధ్యప్రదేశ్ లో మహిళల జోలికొస్తే ఊరుకోమని ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ ఈ సందర్భంగా హెచ్చరించారు. మహిళలపై దాడులకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని అన్నారు. యువతిపై దాడికి పాల్పడ్డ వ్యక్తిని అరెస్టు చేసినట్లు ముఖ్యమంత్రి వెల్లడించారు. అలాగే యువతిపై త్రిపాఠి దాడి చేస్తున్న సమయంలో వీడియో తీసిన వ్యక్తిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రియుడి దాడిలో గాయపడ్డ యువతిని పోలీసులు ఆసుపత్రిలో చేర్పించగా.. ఆమె ప్రస్తుతం కోలుకుంటున్నారు. కాగా యువతిపై దాడికి పాల్పడ్డ ప్రేమోన్మాదిపై ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తక్షణ చర్యలు చేపట్టి బుద్ధి చెప్పడంపై ప్రశంసలు వస్తున్నాయి.