విచిత్రమైన ఆర్టీఐ దరఖాస్తు.. దేవుడితో అడిగి వర్షాలెందుకు రావట్లేదో చెప్పండి
వానాకాలంలో ఎండలు, ఉక్కపోతతో విసిగిపోయిన బీహార్‌కు చెందిన ఆర్టీఐ కార్యకర్త రాజ్‌కుమార్ ఝా సమాచార హక్కు చట్టం ద్వారా పలు ప్రశ్నలు సంధించాడు.
రైట్ టూ ఇన్ఫర్మేషన్ (ఆర్టీఐ) చట్టాన్ని ఉపయోగించి ప్రజలకు తెలియని ఎన్నో విషయాలను బహిర్గతం చేయవచ్చు. ఆయా ప్రభుత్వ శాఖల్లో జరిగే అవినీతిని వెలికి తీసే అవకాశం ఈ చట్టం ద్వారా కలిగింది. అయితే అప్పుడప్పుడు కొందరు ఈ చట్టాన్ని తమ సరదా, పబ్లిసిటీ, నిరసన వ్యక్తం చేయడం కోసం వాడుతుంటారు. ఇప్పుడు అలాంటి దరఖాస్తే ఒకటి భూవిజ్ఞాన శాఖ (Ministry of Earth Science) అధికారులకు వచ్చింది.
వానాకాలంలో ఎండలు, ఉక్కపోతతో విసిగిపోయిన బీహార్‌కు చెందిన ఆర్టీఐ కార్యకర్త రాజ్‌కుమార్ ఝా సమాచార హక్కు చట్టం ద్వారా పలు ప్రశ్నలు సంధించాడు. సకాలంలో వర్షాలు పడకపోవడంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారని.. దీనికి కారణమేంటో సరైన సమాచారం ఇవ్వాలని కోరాడు. మీకు కనుక తెలియకపోతే దేవుడిని అడిగైనా సరే తనకు సమాచారం పంపాలని సూచించాడు. దేవుడితో మాట్లాడటానికి అవసరం అయితే ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్-3 ఏమైనా ఉపయోగపడుతుందేమో పరిశీలించాలని కోరాడు.
వర్షాకాలం మొదలై వారాలు గడుస్తున్నా బీహార్, పరిసర ప్రాంతాల్లో సరిపడా వానలు కురవలేదు. ప్రజలు, రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో గౌరాబౌరమ్ జిల్లా మహౌర్‌కు చెందిన రాజ్‌కుమార్ మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్స్ అధికారులను ఆర్టీఐ ద్వారా ప్రశ్నించాడు. వర్షాలు సరిగా కురవక పోవడానికి అసలు కారణాలు ఏంటో వివరించాలని కోరాడు. కాగా, ఈ దరఖాస్తులో దేవుడిని కూడా ప్రతివాదిగా చేర్చడం గమనార్హం.
కాగా, చంద్రయాన్‌కు దేవుడితో లింకేంటని ప్రశ్నించగా.. ప్రజ్ఞాన్ రోవర్ దేవుడి నుంచి సంకేతాలు తీసుకొని విక్రమ్ ల్యాండర్ ద్వారా భూమికి సమాచారం పంపిస్తుందని.. దాని సహాయంతో వాతావరణ మార్పులకు గల కారణాలు విశ్లేషించవచ్చని విలేకరుల ముందు విచిత్రమైన వాదన చేశాడు. ప్రస్తుతం ఈ ఆర్టీఐ దరఖాస్తు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.