గవర్నర్ల సాయంతో రాష్ట్రాలను గుప్పిట్లో పెట్టకోవాలని చూస్తోన్న బీజేపీ
తెలంగాణ గవర్నర్ తమిళిసై అయితే ఏకంగా రాజకీయ విమర్శలకు దిగుతూ.. ఒక బీజేపీ నాయకురాలిగా వ్యవహరిస్తున్నారని టీఆర్ఎస్ మంత్రులు పలుమార్లు ఆరోపించారు.
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ.. గవర్నర్లను అడ్డు పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వాలను ఇబ్బందులు పెడుతున్నది. ముఖ్యంగా ఎన్డీయేతర ప్రాంతీయ పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో పెత్తనం చేయడానికి గవర్నర్ల వ్యవస్థను వాడుకుంటోంది. దక్షిణాదిలోని మూడు రాష్ట్రాల్లో ఇలా గవర్నర్ల పెత్తనం పెరిగిపోవడంతో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు బీజేపీపై ఆరోపణలు చేస్తున్నాయి. గవర్నర్లు తమ అధికార పరిధిని దాటి వ్యవహరిస్తున్నారంటూ పలువురు సీఎంలు బాహాటంగానే విమర్శలు చేస్తున్నారు.
తెలంగాణ సీఎం కేసీఆర్, గవర్నర్ తమిళిసై మధ్య కొంత కాలంగా విభేదాలు ఉన్నాయి. గతంలో గవర్నర్‌గా పని చేసిన నరసింహన్‌తో కేసీఆర్‌కు మంచి సంబంధాలు ఉండేవి. తమిళిసై గవర్నర్‌గా నియమించబడిన కొత్తలో కేసీఆర్‌తో మంచి టర్మ్స్ ఉన్నాయి. కానీ ఎప్పుడైతే కేసీఆర్.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా విమర్శలు చేయడం ప్రారంభించారో.. అప్పటి నుంచి తమిళిసై వ్యవహార శైలి మారిపోయింది. రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి సమాచారం ఇవ్వకుండా పర్యటనలు చేయడం, ప్రజా దర్బార్ పేరుతో రాజ్‌భవన్‌లో కార్యక్రమాలు నిర్వహించాలని భావించడంతో పాటు.. కొన్ని విషయాలపై తానే విచారణలకు దిగడం ప్రభుత్వానికి ఇబ్బందిగా మారింది.
తెలంగాణ గవర్నర్ తమిళిసై అయితే ఏకంగా రాజకీయ విమర్శలకు దిగుతూ.. ఒక బీజేపీ నాయకురాలిగా వ్యవహరిస్తున్నారని టీఆర్ఎస్ మంత్రులు పలుమార్లు ఆరోపించారు. అయినా సరే తమిళిసై మాత్రం తన శైలిని మార్చుకోలేదు. పుదుచ్చెరి ఇంచార్జి లెఫ్టినెంట్ గవర్నర్‌గా ఉన్న తమిళిసై.. అక్కడి ప్రభుత్వంతో కూడా ఘర్షణ వైఖరితో వ్యవహరిస్తున్నారు. ఆ రాష్ట్రానికి వెళ్లినా తెలంగాణపై విమర్శలు చేస్తున్నారు.
తాజాగా తమిళనాడులో కూడా స్టాలిన్ ప్రభుత్వానికి గవర్నర్ ఆర్ఎన్ రవితో విభేదాలు భగ్గుమన్నాయి. డీఎంకే ప్రభుత్వం అసెంబ్లీలో పాస్ చేసిన అనేక బిల్లులను గవర్నర్ రవి ఆమోదించకుండా తొక్కి పెట్టారు. దీంతో ఆయన ఆ పదవికి అనర్హుడని, వెంటనే రీకాల్ చేయాలని డీఎంకే డిమాండ్ చేస్తోంది. ఈ విషయంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలవడానికి ప్రయత్నించినా డీఎంకేకు అపాయింట్‌మెంట్ లభించలేదు. దీంతో 50 మంది డీఎంకే, మిత్రపక్షాలకు చెందిన ఎంపీలు రాష్ట్రపతి భవన్‌లో మెమోరాండం సమర్పించి వచ్చారు. దాని ప్రతిని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా కార్యాలయానికి పంపించారు.
ఇక కేరళలో కూడా దాదాపు ఇలాంటి పరిస్థితే నెలకొన్నది. అక్కడి ఎల్డీఎఫ్ ప్రభుత్వానికి, గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్ మధ్య సరైన సంబంధాలు లేవు. దీంతో గవర్నర్‌కు ఉన్న కొన్ని అధికారాలకు కత్తెర వేయాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్ర పరిధిలో ఉన్న యూనివర్సిటీల చాన్సలర్ పదవి నుంచి గవర్నర్‌ను తప్పిస్తూ ఆర్డినెన్స్ జారీ చేసింది. ఈ మేరకు అక్కడి సీఎంవో కూడా ఒక ప్రకటన విడుదల చేసింది.
దక్షిణాదిన కీలకమైన తెలంగాణ, తమిళనాడు, కేరళలో ఉన్న ప్రభుత్వాలతో గవర్నర్లు ఘర్షణ వైఖరిని అవలంభిస్తున్నారు. గవర్నర్లు తరచూ ప్రతిపక్షాల మాదిరిగా విమర్శలు చేస్తున్నారు. కేంద్రంలోని బీజేపీ ఆదేశాల మేరకే గవర్నర్లు ఇలా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. రాష్ట్రాల హక్కులను హరించే విధంగా కేంద్రం వ్యవహరిస్తోందని.. ఈ క్రమంలోనే గవర్నర్ల ద్వారా ఇబ్బందులకు గురి చేస్తోందని అంటున్నారు. కేంద్ర ప్రభుత్వం ఇలాంటి విధానాన్ని మార్చుకోకపోతే కేంద్ర, రాష్ట్రాల మధ్య సంబంధాలు మరింతగా బలహీన పడతాయనే ఆందోళన వ్యక్తం అవుతోంది.