Telugu Global
National

మందుబాబులు సిగ్గుపడేలా.. బీహార్ ప్రభుత్వం సరికొత్త ప్రయోగం

గతంలో మందుతాగి పోలీసులకు చిక్కితే జరిమానా విధించేవారు. ఆ విషయం ఎవరికీ తెలిసేది కాదు. గుట్టుచప్పుడు కాకుండా జరిమానా చెల్లించి బయటపడేవారు మందుబాబులు. కానీ ఇప్పుడు మందు తాగితే ఊరంతా తెలిసేలా పోస్టర్లు వేస్తున్నారు.

మందుబాబులు సిగ్గుపడేలా.. బీహార్ ప్రభుత్వం సరికొత్త ప్రయోగం
X

పేరు: ఫలానా

ఊరు: ఫలానా

చేసిన తప్పుడుపని: మందు తాగడం

ఇలా ఎవరి ఇంటి ముందు అయినా ప్రభుత్వం నోటీసు అంటిస్తే ఏం చేస్తారు. సిగ్గుతో చచ్చిపోతారు. కొంతమంది ఇవేమీ పట్టనట్టు మళ్లీ మందుకొట్టడానికి వెళ్లిపోతారు. కానీ ఆ కాస్త సిగ్గుపడేవారయినా మారిపోతారు కదా. అందుకే బీహార్ ప్రభుత్వం ఈ పోస్టర్ల ప్రయోగం మొదలు పెట్టింది. మందు తాగి పోలీసులకు పట్టుబడితే తెల్లారి వారి ఇంటిముందు పోస్టర్ పడుతుంది. దాన్ని చించేయడానికి లేదు, సిగ్గుతో చితికిపోవాల్సిందే. లేదా మారిన మనిషిలాగా రెండు వారాల తర్వాత ఆబ్కారీ పోలీసులకు చెప్పి వాటిని తీసేయించుకోవాలి.

2016లో సంపూర్ణ మద్యపాన నిషేధం తర్వాత బీహార్ పరిస్థితుల్లో చాలా మార్పొలొచ్చాయి. బీహార్ లో మద్యం తయారీ, విక్రయం, మద్యపానం అన్నీ నిషేధమే. అయితే పొరుగు రాష్ట్రాలనుంచి వస్తున్న మద్యం అక్కడక్కడా మందుబాబులకు అందుబాటులో ఉంటోంది. దీన్ని కూడా పూర్తిగా అరికట్టే ప్రయత్నాలు చేస్తున్నా సాధ్యం కావడంలేదు. దీంతో మందుబాబుల్లోనే మానసిక పరిణితి తెచ్చేందుకు ప్రభుత్వం ఇలా పోస్టర్లు వేస్తోంది.

గతంలో మందుతాగి పోలీసులకు చిక్కితే జరిమానా విధించేవారు. ఆ విషయం ఎవరికీ తెలిసేది కాదు. గుట్టుచప్పుడు కాకుండా జరిమానా చెల్లించి బయటపడేవారు మందుబాబులు. కానీ ఇప్పుడు మందు తాగితే ఊరంతా తెలిసేలా పోస్టర్లు వేస్తున్నారు. ఇటీవల గోపాల్ గంజ్ జిల్లాలో మందుబాబుల ఇళ్లకు పోలీసులు పోస్టర్లు అంటించారు. 52వేల ఇళ్లకు పోస్టర్లు వేశారు. వారి గురించి ఊరంతా తెలిసేలా చేశారు.

మారే అవకాశం ఉందా..

ఆరోగ్యం పాడవుతుందని తెలుసు, జేబుకు చిల్లుపడుతుందనీ తెలుసు, తాగిన మైకంలో తప్పులు చేస్తారనీ తెలుసు. అన్నీ తెలిసినా ఆ వ్యసనాన్ని వదులుకోలేరు చాలామంది. అసలు మందు అందుబాటులో లేకుండా చేస్తే కొంతమంది అయినా పద్ధతి మార్చుకుంటారు. బీహార్ లో అలాగే చాలామంది మంచివారయ్యారు. కానీ కొన్నిచోట్ల మద్యం దొడ్డిదారిలో రాష్ట్రానికి చేరడంతో మళ్లీ వీరంతా వక్రమార్గం పడుతున్నారు. అలాంటి వారికి కౌన్సెలింగ్ ఇవ్వడం కంటే, ఇలా పరువు పోతుందని భయపెట్టడం మేలని భావిస్తోంది ప్రభుత్వం. అందుకే ఈ పోస్టర్ల నిర్ణయం తీసుకుంది.

First Published:  22 Oct 2022 4:31 AM GMT
Next Story