బతికుండగానే పెద్దకర్మ.. తనకు తానే పిండం పెట్టుకున్న వైనం
ఉన్నావ్ జిల్లాలోని కెవానా గ్రామానికి చెందిన జఠాశంకర్ గురువారం రాత్రి తన పెద్ద కర్మ కార్యక్రమం ఘనంగా నిర్వహించాడు. దీనికి అతని బంధువులు, గ్రామస్తులు హాజరై విందు స్వీకరించారు.
అతని వయసు 70 ఏళ్లు ఉంటాయి. మూడు పెళ్లిళ్లు చేసుకున్నాడు. ఏడుగురు పిల్లలు కూడా ఉన్నారు. అయినా తాను చనిపోయాక తనకు పెద్దకర్మ కార్యక్రమం చేస్తారో లేదో అనే సందేహంతో ఆ ముచ్చట కూడా తానే తీర్చేసుకోవాలనుకున్నాడు. అనుకున్నదే తడవుగా 300 మందికి చక్కటి విందు ఏర్పాటు చేశాడు. వారు కూడా ఇదేం పని అనుకుంటూనే... హాయిగా వచ్చి తిని వెళ్లిపోయారు.
ఉత్తరప్రదేశ్‌లో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.. ఉన్నావ్ జిల్లాలోని కెవానా గ్రామానికి చెందిన జఠాశంకర్ గురువారం రాత్రి తన పెద్ద కర్మ కార్యక్రమం ఘనంగా నిర్వహించాడు. దీనికి అతని బంధువులు, గ్రామస్తులు హాజరై విందు స్వీకరించారు. కొద్ది వారాల క్రితమే అతను తనకు తాను పిండం పెట్టుకునే కార్యక్రమాన్ని కూడా పూర్తిచేశాడు.
ఇంకో విశేషమేమంటే.. జఠాశంకర్ తన సమాధిని కూడా మూడేళ్ల క్రితమే తన వ్యవసాయ క్షేత్రంలో సిద్ధం చేసుకున్నాడు. దీనిపై అతనేం చెబుతున్నాడంటే.. మరణానికి ముందు ఈ కార్యక్రమాలు చేయడం మన ఆచారాల్లో భాగం కాదు. అయినా నేను నిర్వహించుకున్నా. ప్రస్తుతం నేను పూర్తి ఆరోగ్యంతో ఉన్నా.. అని వివరించాడు. తాను ఎవరిపైనా ఎటువంటి నమ్మకం పెట్టుకోలేదని చెప్పాడు. ఇదంతా చూసిన జనం ఎవరి బుర్రలో ఎప్పుడు ఎలాంటి ఆలోచనలు వస్తాయో ఎలా చెప్పగలం అనుకుంటూ నవ్వుకుంటున్నారు.