Telugu Global
National

వీడియో లీక్ కేసులో కొత్త ట్విస్ట్.. అబద్ధం చెప్పిందెవరు..?

ఆమె సెల్ ఫోన్లో ఎవరి వీడియోలు లేకపోతే తోటి విద్యార్థినులు ఎందుకు హడలిపోయారు, అసలా అమ్మాయినే ఎందుకు టార్గెట్ చేశారు. వీడియోలు లేకపోతే ఆత్మహత్యాయత్నం చేసింది ఎవరు..?

వీడియో లీక్ కేసులో కొత్త ట్విస్ట్.. అబద్ధం చెప్పిందెవరు..?
X

చండీగఢ్ యూనివర్శిటీ హాస్టల్ లో 60మంది అమ్మాయిల నగ్న వీడియోల వ్యవహారం దేశవ్యాప్తంగా కలకలం రేపింది. వారిలో కొందరు ఆత్మహత్యా ప్రయత్నం చేశారని, ఒకరు చనిపోయారనే వార్తలు కూడా వచ్చాయి. అయితే ఇప్పుడు అసలు విషయం ఇదీ అంటూ పోలీసులు కొత్త ట్విస్ట్ ఇచ్చారు. అసలు యూనివర్శిటీలో ఎవరూ ఆత్మహత్యాయత్నం చేయలేదని, ఒకరు చనిపోయారంటున్న వార్తలు కూడా అవాస్తవమేనంటున్నారు.

అది సెల్ఫీ వీడియో..

చండీగఢ్ యూనివర్శిటీలో నగ్న వీడియో అనేది కొంతమేర వాస్తవం. అయితే ఓ విద్యార్థిని హాస్టల్ గదిలో తన సెల్ఫీ వీడియో తీసుకుని అది తన బాయ్ ఫ్రెండ్ కి పంపించింది. ఆ విషయం బయటపడటంతో మిగతా విద్యార్థినులు కూడా హడలిపోయారట. ఆమె ఫోన్లో తమ వీడియోలు కూడా ఉన్నాయని ఆరోపిస్తూ ఆందోళనకు దిగారు. దీంతో అధికారులు కదిలొచ్చారు. కొంతసేపు ఈ వ్యవహారాన్ని కప్పిపెట్టాలని చూసినా, చివరకు విచారణకు ఆదేశించారు. ఆ అమ్మాయిని అదుపులోకి తీసుకున్న పోలీసులు, ఆమె సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. విచారణ చేపట్టారు.

హాస్టల్‌ లో ఉన్న అమ్మాయిల అసభ్యకరమైన వీడియోలేవీ ఆమె సెల్ ఫోన్లో లేవని, అవన్నీ వట్టి పుకార్లే అని యూనివర్శిటీ ప్రో ఛాన్స్ లర్ ఆర్ఎస్ బావా అధికారికంగా ప్రకటించారు. 60 మంది విద్యార్థినుల నగ్న చిత్రాలను తన బాయ్ ఫ్రెండ్ కి పంపించిందనే ఆరోపణలు ఎదుర్కొంటున్న అమ్మాయి సెల్ ఫోన్ ను అధికారులు క్షుణ్ణంగా పరిశీలించారు. అందులో ఆమెకు సంబంధించిన వ్యక్తిగత వీడియోలు మినహా మిగతా వీడియోలేవీ లేవని తేల్చారు. వేరేవారికి పంపించిన ఆధారాలు కూడా లేవన్నారు. ఆత్మహత్యాయత్నం అనే వ్యవహారం వట్టి పుకారేనని తేల్చారు.

అబద్ధం చెప్పిందెవరు..?

ఆమె సెల్ ఫోన్లో ఎవరి వీడియోలు లేకపోతే తోటి విద్యార్థినులు ఎందుకు హడలిపోయారు, అసలా అమ్మాయినే ఎందుకు టార్గెట్ చేశారు. వీడియోలు లేకపోతే ఆత్మహత్యాయత్నం చేసింది ఎవరు..? ఈ వీడియోలను సోషల్ మీడియాలో చూసిందెవరు..? నగ్నవీడియోలు లీక్ చేస్తానంటూ సదరు విద్యార్థిని కొంతమందిని బ్లాక్ మెయిల్ చేసిందనే ఆరోపణలు కూడా వచ్చాయి. వాటి సంగతేంటి..? ప్రస్తుతానికి ఇవన్నీ సమాధానం లేని ప్రశ్నలుగానే మిగిలిపోయాయి. చండీగఢ్ యూనివర్శిటీపై పడిన మచ్చను తుడిపేసేందుకు అధికారులు కష్టపడుతున్నారనే విషయం మాత్రం తేలిపోయింది.

First Published:  19 Sept 2022 8:25 AM IST
Next Story