సీఎంతో కాళ్లు కడిగించుకున్న వ్యక్తి బాధితుడు కాదు.. - ఆదివాసీపై మూత్ర విసర్జన కేసులో కొత్త కోణం
బీజేపీ నేత ఆదివాసీ యువకుడిపై మూత్రం పోసిన ఘటన వైరల్ కావడంతో దేశవ్యాప్తంగా ఇది చర్చనీయాంశమైంది. బీజేపీ నేత తీరుపై తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి.
ఆదివాసీ యువకుడిపై బీజేపీ నాయకుడు మూత్ర విసర్జన చేసి అవమానించిన ఘటనలో మధ్యప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి బాధితుడి కాళ్లు కడిగి క్షమాపణ కోరిన విషయం తెలిసిందే. అయితే ఈ ఘటనకు సంబంధించిన వ్యవహారం ఇప్పుడు కొత్త మలుపు తీసుకుంది. ఈ ఘటనలో అసలైన బాధితుడిని తాను కాదని.. ఆ వీడియోలో ఉన్న వ్యక్తిని తాను కాదంటూ సీఎంతో కాళ్లు కడిగించుకున్న దశమత్ రావత్ తాజాగా వెల్లడించారు. నిందితుడు ప్రవేశ్ శుక్లా తనతో బలవంతంగా సంతకం చేయించారని దశమత్ పేర్కొనడం గమనార్హం.
బీజేపీ నేత ఆదివాసీ యువకుడిపై మూత్రం పోసిన ఘటన వైరల్ కావడంతో దేశవ్యాప్తంగా ఇది చర్చనీయాంశమైంది. బీజేపీ నేత తీరుపై తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. ఈ పరిస్థితిని చక్కదిద్దేందుకు మధ్యప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ బాధితుడిని తన నివాసానికి పిలిపించి స్వయంగా అతని కాళ్లు కడిగి క్షమాపణ కోరిన విషయం తెలిసిందే.
అయితే.. ఇప్పుడు అసలు బాధితుడు అతను కాదని తెలియడంతో ఈ వ్యవహారం వైరల్ అవుతోంది. ఈ ఉదంతంపై కాంగ్రెస్ పార్టీ నేతలు స్పందిస్తూ.. నిజమైన బాధితుడి కాళ్లు కడగకుండా సీఎం నాటకమాడారంటూ విమర్శించారు. ఈ నేపథ్యంలో తమ పరువు పోతుందనుకుంటే.. సీఎం చౌహాన్ అసలైన బాధితుడిని రప్పించి అతని కాళ్లు కూడా కడుగుతారేమో చూడాలి మరి!