గృహహింస కేసు విచారణకు మహిళా ఆఫీసర్.. కుక్కతో దాడి చేయించిన వ్యక్తి
ఈ ఘటనపై కేరళ రాష్ట్ర మంత్రి వీణా జార్జ్ స్పందించారు. చిత్తశుద్ధితో విధులు నిర్వహిస్తున్న అధికారులపై కుక్కతో దాడి చేయించడం విచారకరమన్నారు. అధికారులపై కుక్కతో దాడి చేయించిన వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
కట్టుకున్న భర్త నిత్యం చిత్రహింసలకు గురి చేస్తున్నాడని.. ఓ భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు విచారణ కోసం బాధితురాలి ఇంటికి మహిళా ఆఫీసర్ వెళ్లింది.. అయితే క్రూరుడైన భర్త విచారణకు వచ్చిన మహిళా ఆఫీసర్‌పై కుక్కను ఉసిగొల్పడంతో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ షాకింగ్ ఘటన కేరళ రాష్ట్రంలో జరిగింది.
వయనాడ్ జిల్లా మేపద్దికి చెందిన ఓ వ్యక్తి తన భార్యను నిత్యం వేధిస్తున్నాడు. అతడి చిత్రహించలను భరించలేని బాధితురాలు ఇటీవల పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో అతడిపై గృహహింస కేసు నమోదయింది. కేసు విచారణ కోసం మహిళా ఆఫీసర్ మరో ఉద్యోగితో కలిసి బాధితురాలి ఇంటికి వెళ్లి మాట్లాడుతుండగా.. ఆమె భర్త సదరు అధికారిపైకి కుక్కను ఉసిగొల్పాడు. ఈ ఘటనలో మహిళా ఆఫీసర్, ఆమె వెంట వచ్చిన ఉద్యోగిని తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం వారు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
ఈ ఘటనపై రాష్ట్ర మంత్రి వీణా జార్జ్ స్పందించారు. చిత్తశుద్ధితో విధులు నిర్వహిస్తున్న అధికారులపై కుక్కతో దాడి చేయించడం విచారకరమన్నారు. ఇంట్లో భార్యను చిత్రహింసలకు గురి చేయడమే కాకుండా.. విచారణకు వచ్చిన అధికారులపై కుక్కతో దాడి చేయించిన వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.