Telugu Global
National

ఆహా ఏమి అదృష్టం.. దీపావళి గిఫ్ట్‌గా ఉద్యోగులకు కార్లు, బైకులు ఇచ్చిన ఓనర్

ఓ కార్యక్రమం నిర్వహిస్తున్నామని ఉద్యోగులందరినీ యజమాని పిలిచాడు. కానీ అక్కడ వారికి సర్‌ప్రైజ్ గిఫ్ట్‌లు అందడంతో భావోద్వేగానికి గురై కంటతడి పెట్టారు.

ఆహా ఏమి అదృష్టం.. దీపావళి గిఫ్ట్‌గా ఉద్యోగులకు కార్లు, బైకులు ఇచ్చిన ఓనర్
X

దీపావళి వస్తే ఉద్యోగులకు స్వీట్ బాక్సులు ఇవ్వడం సాధారణమే. కొన్ని సంస్థలు బోనస్‌లు కూడా ఇస్తుంటాయి. కానీ ఈ సంస్థలో ఉద్యోగులు మాత్రం బంపర్ ఆఫర్ కొట్టేశారు. టార్గెట్లతో ఇబ్బందులు పెట్టే బాసులున్న ఈ రోజుల్లో.. తన ఉద్యోగుల పనితనానికి మెచ్చి ఏకంగా కార్లు, బైకులు గిఫ్టులుగా ఇచ్చాడు. అనుకోని ఈ సర్‌ప్రైజ్‌కు ఉద్యోగులు ఆశ్చర్యపోవడమే కాకుండా.. కొంత మంది కన్నీళ్లు కూడా పెట్టుకున్నారు. ఈ అరుదైన సంఘటన తమిళనాడు రాష్ట్రంలో చోటు చేసుకుంది.

చెన్నైలోని చల్లాని జ్యూవెలర్స్ యజమాని జయంతి లాల్ చాయంతి తన దుకాణంలో పని చేసే ఉద్యోగులకు దీపావళి గిఫ్ట్‌గా కార్లు, బైకులు ఇచ్చారు. ఉద్యోగుల పని తీరు, హోదాలను బట్టి కొంత మందికి బైకులు, మరి కొంత మందికి కార్లను పంచారు. ఇదుకోసం జయంతి లాల్ రూ. 1.20 కోట్లు ఖర్చు చేశారు. సిబ్బంది కోసం 10 కార్లు, 20 బైకులను కొన్నారాయన. ప్రతీ ఏడాది దీపావళి సమయంలో ఉద్యోగులందరి కోసం ప్రత్యేకంగా కార్యక్రమం నిర్వహిస్తారు. సిబ్బంది కుటుంబ సభ్యులతో పాల్గొని ఆటపాటలతో కాసేపు గడిపి, భోజనం చేసి ఇళ్లకు వెళ్తుంటారు.

ఈ ఏడాది కూడా అలాగే ఓ కార్యక్రమం నిర్వహిస్తున్నామని ఉద్యోగులందరినీ యజమాని పిలిచాడు. కానీ అక్కడ వారికి సర్‌ప్రైజ్ గిఫ్ట్‌లు అందడంతో భావోద్వేగానికి గురై కంటతడి పెట్టారు. కార్యక్రమం అనంతరం జయంతి లాల్ మాట్లాడుతూ.. వీళ్లందరూ నా ఉద్యోగులు కాదు, కుటుంబ సభ్యులు. నా విజయం, వైఫల్యం ప్రతీ ఒక్కదానిలో వీరు నాతో పాటు నడిచారు. నా వెన్నంటే ఉంటూ నాకు భరోసా ఇచ్చారు. నా దుకాణం లాభాల బాట పట్టడానికి వీళ్లు చేసిన కృషికి వెలకట్టలేను. అందుకే వారి కోసం ఏదైనా చేయాలని అనుకున్నాను. అందుకే ఇలా సర్‌ప్రైజ్ గిఫ్ట్‌లు ఇచ్చానని చెప్పారు. యజమాని ఇచ్చిన బహుమతుల పట్ల ఉద్యోగులు సంతోషం వ్యక్తం చేశారు.


First Published:  17 Oct 2022 11:54 AM IST
Next Story