ఓ గుంపు దేశాన్ని ఇష్టారాజ్యంగా యేలుతోంది రాహుల్ గాంధీ ధ్వజం
దేశంలో సామరస్యం సన్నగిల్లిపోతూ విద్వేషాలు పెచ్చరిల్లుతున్న పరిస్థితులను ప్రస్తావిస్తూ రాహుల్ విమర్శలు గుప్పించారు.కొద్ది మంది వ్యక్తుల గుంపు భారతదేశాన్ని ఇష్టారాజ్యంగా పాలిస్తోందని మండిపడ్డారు.
రైతులు, పేదలు ఐక్య భారతావని నిర్మాణాన్ని కోరుకుంటుంటే 5-10 మంది వ్యక్తుల గుంపు మాత్రం మరో భారతాన్ని ఏర్పర్చేందుకు ప్రయత్నిస్తున్నారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మండిపడ్డారు. సామరస్యం సన్నగిల్లిపోతూ విద్వేషాలు పెచ్చరిల్లుతున్న పరిస్థితులను ప్రస్తావిస్తూ రాహుల్ విమర్శలు గుప్పించారు. దీనిపై ఆర్‌బిఐ మాజీ గవర్నర్ రఘురామరాజన్ స్పందిస్తూ.. " ఈ పరిస్థితుల మధ్యలో చిక్కుకున్న దిగువ మధ్యతరగతి వారు ఎక్కువగా నష్టపోయారు" అని వ్యాఖ్యానించారు.
రాహుల్ గాంధీ నిర్వహిస్తున్న భారత్ జోడో యాత్రలో రఘురామ రాజన్ పాల్గొన్నవిషయం తెలిసిందే. యాత్రలో నే కాకుండా విరామ సమయంలో వారిద్దరూ ప్రత్యేకంగా తాజా పరిస్థితులపై చర్చించారు. ఈ సందర్భంగా దేశాన్ని కొద్ది మంది సమూహం ఇష్టారాజ్యంగా యేలుతున్నదని రాహుల్ వ్యాఖ్యానించారు.
"ప్రజలు ఉద్యోగాలు కోల్పోయారు. నిరుద్యోగం పెరుగుతోంది. రుణాలు తీసుకుంటున్నందున అప్పులు కూడా పెరుగుతున్నాయి. వడ్డీలు పెరుగుతున్నాయి. రాజకీయ పార్టీలు పట్టించుకోకుండా ఏమి చేస్తున్నాయో . భారతదేశాన్ని ఏకతాటిపైకి తీసుకురావడమే లక్ష్యం. సోదరుల మధ్య ఘర్షణలు, కీచులాటలు ఉంటే ఏ కుటుంబమూ స్థిరంగా ఉండదు. బయటినుంచి ఎటువంటి ముప్పు రాకుండా భద్రంగా ఉండాలంటే అంతర్గతంగా దేశంలో ఐక్యత, సామరస్యాలతో ఉండాలి," అని రాజన్ అన్నారు.
రాజస్తాన్ లోని సవాయ్ మాథోపూర్ లో రాహుల్ యాత్ర ప్రారంభమైనప్పుడు రాజన్ కూడా పాల్గొన్నారు. విద్వేషానికి వ్యతిరేకంగా సాగుతున్న ఈ యాత్రలో మేదావులు, వివిధ రంగాల ప్రముఖులు పాల్గొంటుంటే తమ యాత్ర సఫలమైనట్టేననిపిస్తోందని కాంగ్రెస్ పార్టీ ఓ ట్వీట్ లో పేర్కొంది.