మరో కులంవాడిని ప్రేమించిందని కూతురును హత్య చేసిన కుటుంబం
కుమార్తె వల్ల కుటుంబ పరువు పోతోందని ఆగ్రహించిన తండ్రి, సోదరుడు, బాబాయి, మరో ఇద్దరు బంధువులు కలిసి ఈ నెల 22వ తేదీ రాత్రి శుభాంగిని పొలానికి తీసుకెళ్లారు. తాడు ఆమె గొంతుకు బిగించి ఊపిరాడకుండా చేసి చంపేశారు.
కుటుంబం పరువు పోతుందని కుటుంబ సభ్యులంతా ఏకమై కన్న కుమార్తెనే హతమార్చారు. ఈ దారుణ ఘటన మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లాలో చోటుచేసుకుంది. పింప్రి మహిపాల్ గ్రామానికి చెందిన 22 ఏళ్ల శుభాంగీ జోగ్‌దండ్ బ్యాచిలర్ ఆఫ్ హోమియోపతిక్ మెడిసిన్ అండ్ సర్జరీ (బీహెచ్ఎంఎస్) మూడో ఏడాది చదువుతోంది. ఆమె అదే గ్రామానికి చెందిన ఓ యువకుడిని ప్రేమించింది. దీనిని ఆమె కుటుంబసభ్యులు తీవ్రంగా వ్యతిరేకించారు. ఇక ఆలస్యం చేయకూడదనుకుని వేరొక వ్యక్తితో ఆమెకు వివాహం నిశ్చయించారు.
దీంతో శుభాంగి పెళ్లి కొడుక్కి ఫోన్ చేసి తన ప్రేమ విషయం చెప్పింది. ఈ నేపథ్యంలో వారు వివాహం రద్దు చేశారు. కుమార్తె వల్ల కుటుంబ పరువు పోతోందని ఆగ్రహించిన తండ్రి, సోదరుడు, బాబాయి, మరో ఇద్దరు బంధువులు కలిసి ఈ నెల 22వ తేదీ రాత్రి శుభాంగిని పొలానికి తీసుకెళ్లారు. తాడు ఆమె గొంతుకు బిగించి ఊపిరాడకుండా చేసి చంపేశారు. అనంతరం సాక్ష్యాధారాలు ధ్వంసం చేసే ఉద్దేశంతో శవాన్ని తగలబెట్టి.. అవశేషాలను సమీపంలోని కాలువలో పడేశారు. శుభాంగి కనిపించకపోవడంతో అనుమానం వచ్చిన గ్రామస్తులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనకు సంబంధించి ఐదుగురు నిందితులను శుక్రవారం అరెస్ట్ చేసినట్టు పోలీసులు వెల్లడించారు.