మూఢ నమ్మకంతో తలలు నరుక్కున్నారు..
ఘటనాస్థలిని పరిశీలించిన పోలీసులు అక్కడ మృతులు క్షుద్రపూజలు నిర్వహించి తమను తాము బలి ఇచ్చుకునేందుకు ఏర్పాట్లు చేసుకున్నట్టు గుర్తించారు.
మూఢ నమ్మకాలతో ఓ జంట తమ తలలు తామే నరుక్కొని బలి ఇచ్చుకున్న సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ దారుణం వారి పిల్లలకు తల్లిదండ్రులను శాశ్వతంగా దూరం చేసింది. గుజరాత్‌లోని రాజ్‌కోట్‌కు చెందిన హేము మక్వానా (38), హన్సా మక్వానా (35) దంపతులు వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తున్నారు. వారికి 13, 14 ఏళ్ల వయసు కలిగిన ఇద్దరు పిల్లలు ఉన్నారు.
పిల్లలిద్దరూ ఇటీవల సమీప గ్రామంలోని మేనమామ ఇంటికి వెళ్లి ఆదివారం ఇంటికి తిరిగొచ్చారు. ఇంట్లోకి వెళ్లగానే అక్కడి భీతావహ దృశ్యాన్ని చూసి వణికిపోయారు. తమ తల్లిదండ్రుల తలలు తెగిపడి మృతిచెంది ఉండటం చూసి తల్లడిల్లిపోయారు. పోలీసులకు సమాచారం అందడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.
ఘటనాస్థలిని పరిశీలించిన పోలీసులు అక్కడ మృతులు క్షుద్రపూజలు నిర్వహించి తమను తాము బలి ఇచ్చుకునేందుకు ఏర్పాట్లు చేసుకున్నట్టు గుర్తించారు. తమ తలలు నేరుగా హోమగుండంలో పడేలా ప్రత్యేకంగా ఓ పరికరాన్ని ఏర్పాటు చేసుకున్నట్టు గుర్తించారు. ఘటనాస్థలంలో దొరికిన లేఖను బట్టి.. దంపతులిద్దరూ స్వయంగా ఈ దారుణానికి దిగినట్టు అనుమానిస్తున్నారు.
మృతిచెందిన దంపతులిద్దరికీ కుటుంబ సమస్యలు గాని, ఆర్థిక ఇబ్బందులు గాని లేవు. ఈ నేపథ్యంలో ఇలా తీవ్రమైన నిర్ణయం తీసుకోవడం వెనుక గల కారణాలు ఏమిటనేది గుర్తించేందుకు పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. వారి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.