Telugu Global
National

తమిళ అగ్ర హీరో విజయ్ పై కేసు నమోదు.. కారణం ఏంటంటే?

విజయ్ ప్రస్తుతం లియో అనే సినిమాలో నటిస్తుండగా ఆ సినిమాలోని ఫస్ట్ లిరికల్ సాంగ్ విజయ్ బర్త్ డే సందర్భంగా ఈనెల 22న విడుదలైంది. ఆ సాంగ్ లో విజయ్ నోట్లో సిగరెట్టు పెట్టుకొని కనిపించాడు.

తమిళ అగ్ర హీరో విజయ్ పై కేసు నమోదు.. కారణం ఏంటంటే?
X

తమిళ అగ్ర హీరో, ఇళయ దళపతి విజయ్ రాజకీయాల్లోకి వస్తున్నాడనే వార్త చాలా ఏళ్లుగా ప్రచారంలో ఉంది. గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు కూడా విజయ్ తండ్రి చంద్రశేఖర్ ఓ పార్టీని రిజిస్టర్ చేయించారు. అయితే ఎన్నికలు దగ్గర పడిన తర్వాత ఆ రాజకీయ పార్టీకి తనకు ఎటువంటి సంబంధం లేదని విజయ్ ప్రకటన చేశారు. ఇదిలా ఉండగా.. ఇటీవల విజయ్ వరుసగా విద్యార్థులతో సమావేశం అవుతున్నారు. పబ్లిక్ పరీక్షల్లో ఉత్తమ ప్రతిభ చూపిన విద్యార్థులకు ప్రోత్సాహక అవార్డులు ఇస్తున్నారు. ఈ సందర్భంగా విద్యార్థులను రాజకీయంగా చైతన్యవంతులను చేస్తున్నారు. డబ్బు తీసుకోకుండా ఓటు వేయాలని సూచిస్తున్నారు.

ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల నాటికి విజయ్ సొంత పార్టీ పెట్టడం ఖాయమని తమిళనాడులో ప్రచారం జరుగుతోంది. ఇటీవల విజయ్ బర్త్ డే జరుపుకోగా.. `అన్నా రాజకీయాల్లోకి రా..` అంటూ రాష్ట్రవ్యాప్తంగా ఆయన ఫ్యాన్స్ పోస్టర్లు అంటించారు. ఈ నేపథ్యంలో రాజకీయ నాయకులు అప్పుడే విజయ్ ని టార్గెట్ గా చేసుకొని విమర్శించడం మొదలుపెట్టారు.

విజయ్ ప్రస్తుతం లియో అనే సినిమాలో నటిస్తుండగా ఆ సినిమాలోని ఫస్ట్ లిరికల్ సాంగ్ విజయ్ బర్త్ డే సందర్భంగా ఈనెల 22న విడుదలైంది. ఆ సాంగ్ లో విజయ్ నోట్లో సిగరెట్టు పెట్టుకొని కనిపించాడు. దీనిపై పీఎంకే పార్టీ వ్యవస్థాపకుడు రాందాస్ స్పందిస్తూ.. నా సినిమాల్లో సిగరెట్‌, మద్యం సన్నివేశాలు ఉండవని గతంలో మాటిచ్చావని.. ఇప్పుడు ఆ వాగ్దానం ఏమైంది విజయ్..? అని ప్రశ్నించారు.

హీరో విజ‌య్‌పై కేసు నమోదైంది. లియో లిరికల్ సాంగ్ లో విజయ్ సిగరెట్ నోట్లో పెట్టుకుని కనిపించాడని.. ఈ పాటలో డ్రగ్స్ వాడకం, రౌడీయిజం గురించి పొగిడినట్లు ఉందని చెన్నైకి చెందిన ఆర్టీఐ కార్యకర్త సెల్వం చిత్ర బృందంపై కోర్టులో ఫిర్యాదు చేశాడు. ఈ విషయమై జూన్ 25వ తేదీన ఆన్‌లైన్‌లో ఫిర్యాదు చేసిన సెల్వం.. 26వ తేదీన ఉదయం తన పిటీషన్ ను కోర్టులో సమర్పించాడు. చిత్ర బృందంపై నార్కోటిక్ నియంత్రణ చట్టం కింద చర్యలు తీసుకోవాలని కోరాడు. కోర్టు ఆదేశాల మేరకు మద్యం, పొగాకు వినియోగాన్ని ప్రోత్సహించినందుకు విజయ్ సహా చిత్ర బృందంపై కేసు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు.

First Published:  26 Jun 2023 12:18 PM GMT
Next Story