Telugu Global
National

ఎన్నికల ముందు 'ఇండియా కూటమి'కి బూస్ట్

ఉత్తరప్రదేశ్లో కాంగ్రెస్ కు 17 లోక్ సభ స్థానాలు ఇచ్చిన సమాజ్ వాదీ పార్టీ పొత్తును పటిష్టం చేసింది. ఢిల్లీలో కూడా ఆమ్ ఆద్మీ పార్టీ కాంగ్రెస్ తోనే ఎన్నికలకు వెళ్లాలని నిర్ణయించుకుంది.

ఎన్నికల ముందు ఇండియా కూటమికి బూస్ట్
X

ఎన్నికల ముందు 'ఇండియా కూటమి' మళ్ళీ బలపడుతోంది. నితీష్ కుమార్ 'ఇండియా కూటమి'ని వీడి ఎన్డీయేలో చేరడం, టీఎంసీ, ఆప్, సమాజ్ వాదీ పార్టీలు కాంగ్రెస్ పై విమర్శలు చేయడంతో ఇక 'ఇండియా కూటమి' పనైపోయిందనే టాక్ కొంతకాలం పాటు వినిపించింది. అయితే ఎన్నికలకు ముందు 'ఇండియా కూటమి' మళ్లీ బలపడుతోంది. మిత్రపక్షాలతో ఉన్న సమస్యలను పరిష్కరించుకొని మళ్లీ పుంజుకుంటోంది.

పంజాబ్ లో కాంగ్రెస్ తో పొత్తు ఉండదని.. ఒంటరిగా పోటీ చేస్తామని కొద్ది రోజుల కిందట ఆమ్ ఆద్మీ పార్టీ ప్రకటించింది. ఢిల్లీలో కూడా ఆ పార్టీ ఒంటరిగానే పోటీ చేస్తుందని కూడా ప్రచారం జరిగింది. పొత్తు విషయమై కాంగ్రెస్ తో జరిపిన చర్చలు విఫలం అయ్యాయని.. పశ్చిమ బెంగాల్లో టీఎంసీ ఒంటరిగానే పోటీ చేస్తుందని మమతా బెనర్జీ కూడా ఆ మధ్య ప్రకటన చేశారు. ఉత్తర ప్రదేశ్ లో సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ కూడా కాంగ్రెస్ తీరుపై విమర్శలు చేశారు.

పరిస్థితులు ఈ విధంగా ఉండగానే 'ఇండియా కూటమి'లో కీలక నేత అయిన నితీష్ కుమార్ కూటమిని వీడి ఎన్డీయేలో చేరారు. దీంతో ఇక 'ఇండియా కూటమి' పనైయిపోయిందని ప్రచారం జరిగింది. అయితే ఇప్పుడు ఎన్నికల ముందు ఉన్నట్టుండి 'ఇండియా కూటమి' మళ్లీ బలపడుతోంది. మిత్రపక్షాలన్నీ ఒక్కొక్కటిగా సమస్యలు పరిష్కరించుకొని ఒక్కటవుతున్నాయి.

ఉత్తరప్రదేశ్లో కాంగ్రెస్ కు 17 లోక్ సభ స్థానాలు ఇచ్చిన సమాజ్ వాదీ పార్టీ పొత్తును పటిష్టం చేసింది. ఢిల్లీలో కూడా ఆమ్ ఆద్మీ పార్టీ కాంగ్రెస్ తోనే ఎన్నికలకు వెళ్లాలని నిర్ణయించుకుంది. కాంగ్రెస్ కు ఆ పార్టీ పొత్తులో భాగంగా ఢిల్లీలో మూడు లోక్ సభ స్థానాలను ఇచ్చింది. పంజాబ్ లో కూడా పొత్తు పెట్టుకునేందుకు సిద్ధం అవుతోంది.

కాంగ్రెస్ పై అలిగిన బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా బెట్టు వీడారు. బెంగాల్ లో కాంగ్రెస్ కు రెండు పార్లమెంటు స్థానాలను మాత్రమే ఇస్తామని చెప్పిన మమతా ఇప్పుడు ఆరు స్థానాలు ఇచ్చేందుకు సిద్ధం అయ్యారు. దీనికి ప్రతిగా మేఘాలయ, అస్సాంలలో ఒక్కో సీట్ చొప్పున టీఎంసీకి కేటాయించాలని ఆమె కాంగ్రెస్ ను కోరుతున్నారు. సమాజ్ వాదీ, టీఎంసీ, ఆప్ పార్టీలు దూరం కావడంతో ఇక 'ఇండియా కూటమి' విచ్చిన్నమైందని ప్రచారం జరుగగా.. ఇప్పుడు అనూహ్యంగా కూటమి మళ్ళీ పుంజుకొని బలపడుతోంది.

First Published:  23 Feb 2024 7:23 PM IST
Next Story