భారత్ లో మంకీపాక్స్ తొలి మరణం..
భారత్ కి తిరిగొచ్చిన తర్వాత జ్వరం ఎక్కువ కావడంతో జూలై 27న ఆస్పత్రిలో చేరాడు. అయితే అతని శరీరంపై దద్దుర్లు లేవు, ఇతర చర్మ సంబంధమైన ఇబ్బందులు కానీ లేవు. మంకీపాక్స్ లక్షణాలు లేకపోవడంతో సాధారణ చికిత్సను అందిస్తూ వచ్చారు.
కేరళలో మంకీపాక్స్ బాధితుడు క్రమంగా కోలుకున్నాడన్న వార్తలు వచ్చిన గంటల వ్యవధిలోనే అదే రాష్ట్రంలో మంకీపాక్స్ మరణం కూడా నమోదైంది. దీంతో భారత్ లోనే ఇది తొలి మంకీపాక్స్ మరణంగా రికార్డుకెక్కింది. మంకీపాక్స్ మృతుడి వయసు కేవలం 22 ఏళ్లు కావడం ఆందోళన కలిగించే అంశం.
కేరళలోని త్రిసూర్ జిల్లా పున్నియార్ లో 22 ఏళ్ల యువకుడు మంకీపాక్స్ వైరస్ తో చనిపోయాడు. ఈ మేరకు ఆ రాష్ట్ర వైద్యశాఖ మంత్రి వీణా జార్జ్ అధికారికంగా ప్రకటన విడుదల చేశారు. మృతి చెందిన యువకుడు యూఏఈ నుంచి జూలై 21న భారత్ కు వచ్చాడు. జ్వరం, తలనొప్పి లక్షణాలతో బాధపడ్డాడు. భారత్ కి తిరిగొచ్చిన తర్వాత జ్వరం ఎక్కువ కావడంతో జూలై 27న ఆస్పత్రిలో చేరాడు. అయితే అతని శరీరంపై దద్దుర్లు లేవు, ఇతర చర్మ సంబంధమైన ఇబ్బందులు కానీ లేవు. మంకీపాక్స్ లక్షణాలు లేకపోవడంతో సాధారణ చికిత్సను అందిస్తూ వచ్చారు.
ఆ యువకుడికి యూఏఈలోనే మంకీపాక్స్ సోకింది. కానీ కుటుంబ సభ్యులు ఆ విషయాన్ని దాచి ఉంచారు. జ్వరం మినహా మిగతా లక్షణాలేవీ లేకపోవడంతో వైద్యులకు కూడా అనుమానం రాలేదు. తీరా మరణించిన తర్వాత యూఏఈలోనే మంకీపాక్స్ నిర్ధారణ అయినట్టు అధికారులకు తెలిపారు. జూలై 19న అతనికి మంకీపాక్స్ సోకిందనే విషయాన్ని వెల్లడించారు. యూఏఈ ఇచ్చిన రిపోర్ట్ ను ఇక్కడి వైద్యులకు అందించారు. దీంతో అధికారులు షాకయ్యారు. ఆ రిపోర్ట్ ని పరిశీలించారు, మరణించిన వ్యక్తి నుంచి నమూనాలు సేకరించి పూణేలోని వైరాలజీ ల్యాబ్ కు పంపించారు.
కుటుంబ సభ్యులు ఇచ్చిన సమాచారం ప్రకారం కేరళలో ఇదే తొలి మంకీపాక్స్ మరణంగా నిర్ధారించారు అధికారులు. మనదేశంలో ఇప్పటివరకు నాలుగు మంకీపాక్స్ కేసులు నమోదయ్యాయి. వాటిలో మూడు కేసులు కేరళలోనే వెలుగు చూశాయి. మరొకటి ఢిల్లీలో బయటపడింది. కేరళలో ఇప్పటికే ఓ వ్యక్తి కోలుకున్నాడన్న వార్తలు ఊరటనివ్వగా, వెంటనే ఇప్పుడు మరో వ్యక్తి చనిపోవడంతో కలకలం రేగింది.