యాత్రికుల బస్సుపై ఉగ్ర దాడి.. 9 మంది మృతి, 33 మందికి గాయాలు
దాడికి పాల్పడిన ఉగ్రవాదులను పట్టుకోవడం కోసం సైన్యం, సీఆర్‌పీఎఫ్, పోలీసు బలగాలు వెంటనే వేట ప్రారంభించాయి. సాధారణంగా రియాసీ జిల్లాలో ఉగ్రవాద కార్యకలాపాలు చాలా తక్కువ. అలాంటి ప్రదేశంలో ఈ ఘటన జరగడం గమనార్హం.
యాత్రికులతో వెళుతున్న బస్సుపై ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో బస్సు అదుపు తప్పి పక్కనే ఉన్న లోయలో పడిపోయింది. ఈ ఘటనలో 9 మంది మృతిచెందగా, మరో 33 మంది తీవ్రంగా గాయపడ్డారు. జమ్మూకశ్మీర్‌లోని రియాసీ జిల్లాలో ఆదివారం సాయంత్రం 5.30 గంటల సమయంలో ఈ దారుణం జరిగింది. శివఖోరి ఆలయం నుంచి కట్రాలోని మాతా వైష్ణోదేవి ఆలయానికి వెళుతుండగా తెర్యాత్ గ్రామం వద్ద ఈ ఘటన జరిగింది. సమాచారం అందుకున్న వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు, స్థానికులు సహాయక చర్యలు చేపట్టారు. 9 మృతదేహాలను వెలికి తీసినట్టు రియాసీ జిల్లా ఎస్పీ మోహితా శర్మ తెలిపారు. గాయపడినవారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రులకు తరలించినట్లు వివరించారు. మృతులంతా ఉత్తరప్రదేశ్ వాసులని భావిస్తున్నారు. ఉగ్రవాదులు మొత్తం 25 నుంచి 30 తూటాలను పేల్చారని బాధితులు వెల్లడించారు.
దాడికి పాల్పడిన ఉగ్రవాదులను పట్టుకోవడం కోసం సైన్యం, సీఆర్‌పీఎఫ్, పోలీసు బలగాలు వెంటనే వేట ప్రారంభించాయి. సాధారణంగా రియాసీ జిల్లాలో ఉగ్రవాద కార్యకలాపాలు చాలా తక్కువ. అలాంటి ప్రదేశంలో ఈ ఘటన జరగడం గమనార్హం. ఈ ఘటనపై కేంద్ర మంత్రి అమిత్ షా స్పందిస్తూ యాత్రికులపై దాడి బాధాకరమని తెలిపారు. దీనికి బాధ్యులైన వారిని వదిలేది లేదని స్పష్టంచేశారు.
మరోవైపు ముష్కర దాడిని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఖండించారు. నరేంద్ర మోడీ ప్రభుత్వం కొలువుదీరుతున్న తరుణంలో, పలువురు దేశాధినేతలు మన దేశంలో ఉన్న సమయంలోనే ఈ దారుణం జరిగిందన్నారు. జమ్మూకశ్మీర్‌లో సాధారణ పరిస్థితులను పునరుద్ధరించామని మోడీ సర్కారు జబ్బలు చరుచుకుంటోందని, ఇలాంటి ఘటనలు.. ఆ ప్రకటనల్లోని డొల్లతనాన్ని చాటుతున్నాయని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ అగ్ర నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ కూడా ఈ దాడిని ఖండించారు.