భారతీయ మీడియాలో కూడా మగాళ్ళదే రాజ్యం... నాయకత్వంలో 87 శాతం పురుషులే
భారతీయ మీడియాలో మగాళ్ళ రాజ్యమే నడుస్తోంది. మీడియాలోని నాయకత్వ స్థానాల్లో 87 శాతం పైగా పురుషులే ఉన్నారు.
భారతీయ సమాజంలో ఉన్నట్టే మీడియాలో కూడా స్త్రీల పట్ల వివక్ష రాజ్యమేలుతోంది. ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియాలో మగాళ్ళ రాజ్యమే నడుస్తోంది. ఈ అంశంపై న్యూస్ లాండ్రీ అనే వెబ్ పోర్టల్, UN ఉమెన్ లు కలిసి లింగ వివక్షకు సంబంధించిన ఓ సర్వే నిర్వహింది. ఈ సర్వే నివేదికను 'ది మీడియా రంబుల్' విడుదల చేసింది.
న్యూస్ లాండ్రీ కొద్ది రోజుల క్రితం కుల వివక్షకు సంబంధించిన సర్వే కూడా నిర్వహించింది. భారత్ మీడియాలో 88 శాతం అగ్రకులాల వారే ఉన్నారన్న ఆ సర్వేలో బైటపడింది.
ఏప్రిల్ 2021 నుండి మార్చి 2022 మధ్యలో నిర్వహించిన లింగ వివక్షకు సంబంధించిన ఈ సర్వే వివరాలను న్యూస్ లాండ్రీ ప్రకటించింది. ఈ అధ్యయనం ఏడు ఇంగ్లీష్, ఏడు హిందీ వార్తాపత్రికలు, 12 మ్యాగజైన్లు, తొమ్మిది డిజిటల్ పోర్టల్‌లను కవర్ చేసింది, ఇక్కడ బైలైన్‌లను లెక్కించడం, సర్వే చేయడం ద్వారా డేటా సేకరించారు. వార్తా ఛానెళ్ళ సర్వే కోసం, నివేదిక ఏడు ఇంగ్లీష్ న్యూస్ నెట్‌వర్క్‌లలో 1,094 ప్రైమ్‌టైమ్ షోలను, ఎనిమిది హిందీ వార్తా ఛానెల్‌లలో 981 డిబేట్‌లను సర్వే చేసింది.
నివేదిక ప్రకారం... వార్తా సంస్థలలో డెబ్బై ఐదు శాతం నాయకత్వ స్థానాల్లో (సంపాదకులు, యజమానులు) పురుషులు ఉన్నారు. హిందీ సంస్థలల్లో పరిస్థితులు అత్యంత దారుణంగా ఉన్నాయి. సర్వే చేసిన ఏడు హిందీ వార్తాపత్రికలలో, నాలుగింటిలో ప్రధాన స్థానాలలో ఒక్క మహిళ కూడా లేరు. ఆంగ్ల వార్తాపత్రికలు కొంత మెరుగ్గా ఉన్నాయి. వీటిలో నాయకత్వ స్థానాల్లో 15 శాతం మహిళలు ఉన్నారు. పురుషులు, స్త్రీల మధ్య సమానమైన నిష్పత్తిలో ఉన్న టెలిగ్రాఫ్ పత్రిక దీనికి మినహాయింపు. స్టేట్స్‌మన్, ఇండియన్ ఎక్స్‌ప్రెస్ లలో నాయకత్వ స్థానాల్లో పూర్తిగా పురుషులు మాత్రమే ఉన్నారు.
కేవలం ఇంగ్లిష్ న్యూస్ ఛానెల్స్ లో మాత్రమే మహిళా ఎడిటర్లు, మహిళా యాజమానులు 40 శాతం దాటారు. ఎన్‌డిటివిలో స్త్రీ, పురుషుల మధ్య అత్యంత సమానమైన విభజన జరిగింది, ఇందులో 50 శాతం మహిళలు ఉన్నారు, రిపబ్లిక్ టివిలో ఉన్నత స్థానాల్లో ఒక్క మహిళ కూడా లేరు. ప్రభుత్వ ఆద్వర్యంలో నడుస్తున్న సంసద్ TVలో, యజమానులు,సంపాదకులలో మూడవ వంతు కంటే తక్కువ మంది మహిళలు ఉన్నారు.
డిజిటల్ వార్తా సంస్థలలో, ఈస్ట్‌మోజో, న్యూస్ మినిట్ పోర్టల్ లలో 66.67 శాతం మహిళా సంపాదకులు, యజమానులున్నారు. న్యూస్‌లాండ్రీలో 20 శాతం మహిళలుండగా ఇక స్వరాజ్య వెబ్ పోర్టల్ లో ఒక్క మహిళ కూడాలేరు.
మ్యాగజైన్ విభాగంలో, ఫ్రంట్‌లైన్, ఔట్‌లుక్ హిందీ లో నాయకత్వ స్థానాల్లో పురుషులు, మహిళలు సమాన ప్రాతినిధ్యం కలిగి ఉన్నారు. ఇతర మ్యాగజైన్‌లలో నాయకత్వ స్థానాల్లో మహిళలు అతి తక్కువ గానూ, కొన్నింటిలో అసలు లేని పరిస్థితి ఉంది.
టీవీ ప్యానెలిస్ట్‌లు మరియు యాంకర్లు
వార్తా ఛానెల్‌లలో చర్చల కోసం ఆహ్వానించబడిన ప్యానెలిస్ట్‌లలో స్పష్టమైన లింగ అసమానత ఉన్నట్లు నివేదిక పేర్కొంది.
హిందీ ఛానెల్‌లలో, ప్యానలిస్ట్‌లలో 52 శాతం మంది పురుషులు ఉన్నారు. న్యూస్18, రిపబ్లిక్ భారత్ ప్రైమ్‌టైమ్ షోలకు పురుష యాంకర్లు మాత్రమే ఉన్నారు. ఇదిలా ఉంటే, ABP న్యూస్‌లో 75 శాతం మంది యాంకర్లు మహిళలు. సర్వే చేసిన హిందీ వార్తా ఛానెల్‌లలో 1,400 మంది ప్రత్యేక ప్యానెలిస్టులున్నారు. ఈ ఛానల్ లలో జరిగిన 981 డిబేట్‌లలో, 232 మంది మహిళలు (కేవలం 16 శాతం) మాత్రమే పాల్గొన్నారు. ఇండియా టీవీలో అయితే ప్యానల్ డిస్కషన్స్ లో మహిళలు 10 శాతం కూడా లేరు.
ఇంగ్లీష్ న్యూస్ ఛానెల్‌లలో, సర్వే చేసిన 1,094 ప్రైమ్‌టైమ్ షోలలో మొత్తం 2,019 మంది ప్రత్యేక ప్యానెలిస్ట్‌లలో 371 మంది మహిళలు ఉన్నారు. అంటే 18 శాతం.
ఈ నివేదిక ప్రకారం వార్తా ఛానెల్‌లలో జరిగే డిస్కషన్స్ లో పాల్గొనే ప్యానెలిస్ట్‌లలో 80 శాతానికి పైగా పురుషులున్నారు.
లింగ సమస్యలపై చర్చలు వచ్చినప్పుడు, ఆజ్ తక్‌లో మహిళా ఒక్కరూ లేరు. అయితే, సంసద్ టీవీలో లో, లింగ సమస్యలకు సంబంధించిన చర్చలో పాల్గొన్న ప్యానెలిస్ట్‌లలో 75 శాతం మంది మహిళలు ఉన్నారు.
చర్చించబడిన అంశాన్ని బట్టి కూడా లింగ వివక్ష కొనసాగుతోంది.ఉదాహరణకు, రక్షణ, జాతీయ భద్రత, ఆర్థిక విషయాలపై జరిగిన చర్చలలో మహిళా ప్యానలిస్టులను అతి తక్కువ మందిని పిలిచారు.
అదే న్యూస్ యాంకర్ల విషయంలో కొంత తేడా ఉంది. ఇంగ్లీషు వార్తా ఛానెల్‌లలో టీవీ న్యూస్ యాంకర్లు 47 శాతం మంది, హిందీ ఛానెల్‌లలో టీవీ న్యూస్ యాంకర్లు 58 శాతం మంది ఉన్నారు.
ఏడు ఇంగ్లీష్ వార్తాపత్రికలలో సర్వే చేసిన 2,939 మంది రిపోర్టర్లలో కేవలం 868 మంది మాత్రమే మహిళలున్నారు. దాదాపు మూడింట ఒకవంతు మంది మాత్రమే. అంటే ఎనిమిది శాతం కంటే తక్కువ. హిందీలో మహిళలు వ్రాసిన నివేదికలు మొదటి పేజీలలో 5.51 శాతం మాత్రమే వచ్చాయి. అదే ఇంగ్లీషులో 31 శాతం ఉన్నాయి.
డిజిటల్ మీడియా అవుట్‌లెట్‌లలో, మూక్‌నాయక్‌కు అత్యధికంగా 100 శాతం మహిళల ప్రాతినిధ్యం ఉంది. న్యూస్‌లాండ్రీ ఇంగ్లీష్, క్వింట్, స్క్రోల్ ఒక్కొక్కటి 50 శాతం మహిళల ప్రాతినిద్యం కలిగి ఉంది.
ఇందులో కూడా అట్టడుగు వర్గాలకు చెందిన మహిళల కంటే అగ్రకుల కేటగిరీకి చెందిన మహిళలే ఎక్కువ అవకాశం పొందారు. 59 శాతం మంది అగ్రకుల మహిళా జర్నలిస్టులుండగా, SC నేపథ్యంగల మహిళలు 2.87 శాతం, ST నేపథ్యానికి చెందిన మహిళలు 1.05 శాతం మాత్రమే ప్రాతినిధ్యం పొందారు.
సర్వే చేసిన 12 పత్రికల్లో మొత్తం జర్నలిస్టుల్లో మహిళా జర్నలిస్టుల సంఖ్య 30.7 శాతం మాత్రమే. రక్షణ, జాతీయ భద్రతపై ఆర్టికల్స్ రాసిన మహిళల శాతం 4.3 శాతానికి పడిపోయింది, అదే ఈ కేటగిరీల్లో 95.6 శాతం మంది పురుషులు రాసిన ఆర్టికల్స్ ప్రింట్ అయ్యాయి.
మహిళల పట్ల వేధింపులు, నాయకత్వ పాత్రలలో మహిళల పట్ల పక్షపాతం, ప్రసూతి సెలవు విధానాలు లేకపోవడం, మహిళలకు తక్కువ పరిహారం, లింగ ఆధారిత ప్రమోషన్ వ్యవస్థలతో సహా న్యూస్‌రూమ్‌లలో మహిళలు ఎదుర్కొంటున్న సవాళ్లను కూడా నివేదిక పేర్కొంది.
న్యూస్ లాండ్రీ, UN ఉమెన్ లు సర్వే చేసిన సంస్థలు:
ఇంగ్లీష్ న్యూస్ పేపర్స్ : టైమ్స్ ఆఫ్ ఇండియా, హిందూస్తాన్ టైమ్స్, హిందూ, టెలిగ్రాఫ్, బిజినెస్ స్టాండర్డ్, స్టేట్స్‌మన్, ఇండియన్ ఎక్స్‌ప్రెస్.
హిందీ న్యూస్ పేపర్స్ : దైనిక్ జాగరణ్, దైనిక్ భాస్కర్, హిందుస్థాన్, అమర్ ఉజాలా, రాజస్థాన్ పత్రిక, ప్రభాత్ ఖబర్, పంజాబ్ కేసరి.
ఇంగ్లీష్ న్యూస్ ఛానెల్‌లు: న్యూస్18, ఇండియా టుడే, మిర్రర్ నౌ, NDTV, రిపబ్లిక్ TV, సంసద్ TV, టైమ్స్ నౌ.
హిందీ న్యూస్ ఛానెల్‌లు: ఆజ్ తక్, ABP న్యూస్, న్యూస్18 ఇండియా, ఇండియా TV, NDTV, రిపబ్లిక్ భారత్, సంసద్ టీవీ, జీ న్యూస్.
డిజిటల్ న్యూస్ పోర్టల్స్:ఈస్ట్ మోజో, స్క్రోల్, న్యూస్ లాండ్రీ, స్వరాజ్య, న్యూస్ మినట్, మూక్ నాయక్, క్వింట్, వైర్.