Telugu Global
National

లోయలో పడ్డ కారు.. 8 మంది అయ్యప్ప భక్తుల దుర్మరణం

కారు డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతోనే ఈ ప్రమాదం జరిగినట్లు తేని జిల్లా కలెక్టర్ కేవీ మురళీధరన్ తెలిపారు. కాగా మృతులంతా ఒకే గ్రామానికి చెందినవారు కావడంతో ఆ గ్రామంలో తీవ్ర విషాద ఛాయలు నెలకొన్నాయి.

లోయలో పడ్డ కారు.. 8 మంది అయ్యప్ప భక్తుల దుర్మరణం
X

తమిళనాడు రాష్ట్రం తేని జిల్లా కుమిలి పర్వత ప్రాంత మార్గంలో శుక్రవారం అర్ధరాత్రి జరిగిన ఘోర ప్రమాదంలో 8 మంది అయ్యప్ప భక్తులు దుర్మరణం చెందారు. కేరళలోని శబరిమలకు వెళ్లి తిరిగి వస్తుండగా ఈ దుర్ఘటన జరిగింది. కారు అదుపు తప్పి 50 అడుగుల లోయలో పడిపోయింది. మృతులంతా ఒకే గ్రామానికి చెందిన వారు. తేని జిల్లా షణ్ముగ సుందరాపురం గ్రామానికి చెందిన పదిమంది భక్తులు రెండు రోజుల కిందట శబరిమలకు వెళ్లారు. అక్కడ స్వామివారిని దర్శనం చేసుకున్న అనంతరం తిరుగు ప్రయాణం అయ్యారు.

మార్గమధ్యలో శుక్రవారం అర్ధరాత్రి కుములి ఘాట్‌లో కారు అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న తాగునీటి పైప్ లైన్‌ను ఢీ కొట్టింది. అప్పటికి వాహన వేగం నియంత్రణలోకి రాకపోవడంతో 50 అడుగుల లోయలోకి దూసుకెళ్లింది. అటుగా వచ్చిన వాహనదారులు ప్రమాదం జరిగినట్లు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. తేని, కేరళ పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని సహాయ చర్యలు ప్రారంభించారు. అయితే చీకటి కారణంగా సహాయ చర్యలకు ఆటంకం కలిగింది.

క్రేన్లను తెప్పించి కారును లోయలో నుంచి బయటకు తీశారు. ఎనిమిది మంది ప్రమాదస్థలిలోనే మృతిచెందగా.. గాయపడ్డ ఇద్దరిని చికిత్స కోసం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. కారు డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతోనే ఈ ప్రమాదం జరిగినట్లు తేని జిల్లా కలెక్టర్ కేవీ మురళీధరన్ తెలిపారు. కాగా మృతులంతా ఒకే గ్రామానికి చెందినవారు కావడంతో ఆ గ్రామంలో తీవ్ర విషాద ఛాయలు నెలకొన్నాయి.

First Published:  24 Dec 2022 2:13 PM IST
Next Story