ఏడేళ్ల బాలికపై 74 ఏళ్ల మాజీ ఎస్‌ఐ అత్యాచారం
సోమవారం రాత్రి 8.30 గంటల సమయంలో బాలిక ఆడుకుంటుండగా బంతి కింద పడిపోయింది. దానిని తీసుకొచ్చేందుకు వెళ్లిన బాలిక తిరిగి రాలేదు.
బాధ్యతాయుతమైన పోలీసు వృత్తిలో సబ్ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేసి రిటైరైన వ్యక్తి 74 ఏళ్ల వయసులో ఏడేళ్ల చిన్నారిపై అత్యాచారానికి తెగబడ్డాడు. ఈ ఘటనపై ఆగ్రహంతో నిలదీసిన బాలిక తండ్రిని అదే పోలీసు వృత్తిలో కొనసాగుతున్న నిందితుడి కుమారుడు అడ్డుకొని అతనిపైనే దాడికి పాల్పడటం గమనార్హం. అంతేగాక తనకు చాలా మంది గూండాలు తెలుసని, జరిగింది ఇక్కడితో వదిలేసి.. తాను ఇచ్చే డబ్బు తీసుకొని, ఇల్లు ఖాళీ చేసి వెళ్లిపోవాలని బెదిరింపులకు దిగాడు. దీంతో కోపోద్రిక్తుడైన బాలిక తండ్రి.. నేరుగా వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. బాలిక తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.
అసలేం జరిగిందంటే..
తూర్పు బెంగళూరులో జరిగిన ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. బాధిత బాలిక కుటుంబం 8 రోజుల క్రితమే ఆ ఇంట్లోకి అద్దెకు దిగింది. గ్రౌండ్ ఫ్లోర్లో ఇంటి యజమాని కుటుంబం.. మొదటి అంతస్తులో భార్య, భర్త, చిన్నారి ఉంటున్నారు. సోమవారం రాత్రి 8.30 గంటల సమయంలో బాలిక ఆడుకుంటుండగా బంతి కింద పడిపోయింది. దానిని తీసుకొచ్చేందుకు వెళ్లిన బాలిక తిరిగి రాలేదు. కింద ఆడుకుంటుందేమో అని తల్లి భావించింది. ఎంతసేపటికీ బాలిక రాకపోవడంతో గట్టిగా కేక వేసింది. దీంతో చిన్నారి భయం భయంతో పైకి వచ్చింది. ఆమె పెదవులు వాచిపోయి ఉన్నాయి. ఏమైందని అడగ్గా.. వెక్కి వెక్కి ఏడుస్తూ జరిగిందంతా తల్లికి చెప్పింది.
దీంతో కోపంతో ఆమె తండ్రి నిందితుడిని పట్టుకునేందుకు కిందకి వెళ్లగా.. పోలీసు శాఖలోనే పనిచేస్తున్న నిందితుడి కుమారుడు బాలిక తండ్రిపైనే దాడికి పాల్పడ్డాడు. బెదిరింపులకు దిగాడు. దీంతో మండిపడ్డ అతను పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు నిందితుడితో పాటు బాలిక తండ్రిపై దాడికి పాల్పడిన అతని కుమారుడి పైనా కేసు నమోదు చేశారు. పోలీసులు బాలికకు, అత్యాచారానికి పాల్పడిన నిందితుడికి వైద్య పరీక్షలు చేయిస్తున్నారు.