కేంద్రం పౌరులను వెంటాడుతోంది.. అడ్డుకోండి
ప్రభుత్వం, పోలీసులు వ్యవహరిస్తున్న తీరు నుపుర్ శర్మ కేసులో ఒకలా.. మహమ్మద్ జుబేర్ కేసులో మరోలా ఉందని సివిల్ సర్వెంట్లు ఎత్తి చూపారు.
కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ 72 మంది మాజీ సివిల్ సర్వెంట్లు కేంద్ర అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ కు ఘాటు లేఖ రాశారు. కేంద్ర ప్రభుత్వం పౌరులను వెంటాడుతోందని లేఖలో వారు ఆక్షేపించారు. పౌరులను కేంద్ర ప్రభుత్వం వెంటాడకుండా సలహా ఇవ్వాలని కేకే వేణుగోపాల్ కు వారు విజ్ఞప్తి చేశారు. ఆల్ట్ న్యూస్ సహా వ్యవస్థాపకుడు మహమ్మద్ జుబేర్ ను ఎక్కువ రోజులు పాటు నిర్బంధంలో ఉంచి వ్యక్తిగత పౌర హక్కులను సైతం హరించారని లేఖలో ప్రధానంగా మాజీ సివిల్ సర్వెంట్లు ప్రస్తావించారు.
ఇలాంటి విషయాల్లో కేంద్ర ప్రభుత్వం, పోలీసులే కాకుండా న్యాయాధికారులు కూడా అత్యుత్సాహం చూపుతున్నారని విమర్శించారు. రాజ్యాంగం కల్పించిన భావ ప్రకటన స్వేచ్ఛను వాడుకుంటున్న పౌరులను పోలీసుల సాయంతో కేంద్ర ప్రభుత్వం వెంటాడుతోందని అలా వెంటాడకుండా కేంద్ర ప్రభుత్వానికి సలహా ఇవ్వాలని లేఖలో విజ్ఞప్తి చేశారు .
చట్టం ముందు అందరూ సమానమే అన్న సూత్రం విచ్ఛిన్నమవుతున్న తీరు తమను దిగ్భ్రాంతికి గురిచేస్తోందన్నారు. పౌర హక్కులను హరించే తీరును తామంత విస్తుపోయి చూడాల్సి వస్తోందన్నారు. ప్రభుత్వం, పోలీసులు వ్యవహరిస్తున్న తీరు నుపుర్ శర్మ కేసులో ఒకలా.. మహమ్మద్ జుబేర్ కేసులో మరోలా ఉందని సివిల్ సర్వెంట్లు ఎత్తి చూపారు.
పోలీసులు విచ్చలవిడిగా పౌరులను అరెస్టు చేస్తూ వారిని జైల్లో ఉంచుతూ భారతదేశాన్ని పోలీస్ స్టేట్ గా మారుస్తున్నారని ఇటీవల సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలను కూడా లేఖలో మాజీ సివిల్ సర్వెంట్లు ప్రస్తావించారు. ఈ లేఖలో సంతకాలు చేసిన వారిలో మాజీ హోంశాఖ కార్యదర్శి జికె పిళ్లై, మాజీ చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ హబీబుల్లా, ఆరోగ్య శాఖ మాజీ కార్యదర్శి సుజాత రావు తదితరులు ఉన్నారు.