ఆలయంలో తొక్కిసలాట.. ఏడుగురు మృతి.. 35 మందికి పైగా గాయాలు
ఎప్పటిలాగే బాబా సిద్ధేశ్వర్ నాథ్ దర్శనార్థం భక్తులు ఆదివారం భారీ ఎత్తున తరలివచ్చారు. వారికి ఎలాంటి ఇబ్బందులూ తలెత్తకుండా ఉండేందుకు దేవాలయ నిర్వహణ సభ్యులు ఎన్‌సీసీ క్యాడెట్లకు బాధ్యతలు అప్పగించారు.
ఆలయంలో తొక్కిసలాట జరిగి ఏడుగురు భక్తులు మృతిచెందారు. 35 మందికి పైగా గాయాలపాలయ్యారు. బిహార్ రాష్ట్రం జెహనాబాద్ జిల్లాలోని మఖంపూర్‌లో గల బాబా సిద్ధేశ్వర్ నాథ్ ఆలయంలో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు, జిల్లా అధికారులు వెంటనే అప్రమత్తమై భక్తులను రక్షించేందుకు తక్షణ సహాయక చర్యలు చేపట్టారు. పెద్ద సంఖ్యలో వచ్చిన భక్తులను అదుపు చేసే ప్రయత్నంలో ఈ ఘటన జరిగినట్టు తెలుస్తోంది.
ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో బరావర్ కొండలపై ఉన్న బాబా సిద్ధేశ్వర్ నాథ్ ఆలయం వద్ద ఉత్సవాలు జరుగుతుంటాయి. ఈ ఉత్సవాలకు భక్తులు భారీ ఎత్తున తరలి వస్తుంటారు. ఎప్పటిలాగే బాబా సిద్ధేశ్వర్ నాథ్ దర్శనార్థం భక్తులు ఆదివారం భారీ ఎత్తున తరలివచ్చారు. వారికి ఎలాంటి ఇబ్బందులూ తలెత్తకుండా ఉండేందుకు దేవాలయ నిర్వహణ సభ్యులు ఎన్‌సీసీ క్యాడెట్లకు బాధ్యతలు అప్పగించారు.
ఆదివారం రాత్రి వేళ పూల విక్రయదారుడితో ఘర్షణ చెలరేగడంతో వలంటీర్లు లాఠీచార్జి చేశారని ప్రమాద సమయంలో అక్కడే ఉన్న ఒక భక్తుడు తెలిపారు. ఇది తొక్కిసలాటకు దారితీసిందని, ఆ సమయంలో పోలీసులు ఎవరూ లేరన్నారు. పోలీసు యంత్రాంగం నిర్లక్ష్యం వల్లే ఈ విషాదం చోటు చేసుకుందని ఆయన ఆరోపించారు. మరోవైపు భక్తులను నియంత్రించడానికి ఎన్‌సీసీ క్యాడెట్లు లాఠీలు ఉపయోగించారనే ఆరోపణలను జెహనాబాద్ సబ్ డివిజనల్ ఆఫీసర్ వికాష్ కుమార్ ఖండించారు. అలాంటిదేమీ జరగలేదని ఆయన తెలిపారు. ఇది దురదృష్టకర ఘటన అని, కట్టుదిట్టమైన నిఘా ఉందని చెప్పారు.