Telugu Global
National

దీపావళి రోజు టపాకాయలు కాలిస్తే 6నెలలు జైలు

దీపావళితోపాటు, డిసెంబర్-31, జనవరి 1 కొత్త సంవత్సరం రోజున కూడా టపాకాయల సందడి ఢిల్లీలో కనపడకూడదు, వినపడకూడదు. ఈ నిబంధనలు ఉల్లంఘిస్తే నేరుగా జైలుకే.

దీపావళి రోజు టపాకాయలు కాలిస్తే 6నెలలు జైలు
X

ఢిల్లీలో దీపావళి పండగ రోజు టపాకాయలు కాలిస్తే 200 రూపాయలు జరిమానాతోపాటు 6నెలలు జైలు శిక్ష. టపాకాయలు అమ్మినా, నిల్వ చేసినా, వాటిని కొన్నా కూడా ఇదే ఫలితం ఉంటుంది. అయితే ఇదేమీ కొత్తగా తీసుకొచ్చిన నిబంధన కాదు, సెప్టెంబర్ నుంచి అమలులో ఉన్నదే. అయితే దీపావళి దృష్ట్యా కొత్తగా మరోసారి హెచ్చరికలు జారీ చేసింది ఆమ్ ఆద్మీ ప్రభుత్వం.

ఢిల్లీ పర్యావరణ శాఖ మంత్రి గోపాల్‌ రాయ్‌ దీపావళి నిబంధనలపై మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. బాణసంచా తయారీ, నిల్వ, విక్రయాలు జరపటం నేరమని తెలిపారాయన. నిబంధనల ఉల్లంఘన స్థాయిని బట్టి 5వేల రూపాయల వరకు జరిమానా విధించవచ్చని, పేలుడు పదార్థాల సెక్షన్‌ 9-బి ప్రకారం గరిష్టంగా మూడేళ్ల వరకు జైలు శిక్ష విధించే అవకాశముందని హెచ్చరించారు. నిషేధాన్ని అమలు చేసేందుకు 408 బృందాలను ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు మంత్రి గోపాల్ రాయ్.

టపాకాయలు కాదు, దీపాలు వెలిగించండి..

దీపావళి రోజు టపాకాయలు కాదు, దీపాలు వెలిగించండి అంటూ ఢిల్లీ ప్రభుత్వం ఉద్యమం మొదలు పెట్టబోతోంది. ఢిల్లీలో ఈ శుక్రవారం సెంట్రల్‌ పార్క్‌ వద్ద 51వేల దీపాలు వెలిగిస్తోంది ప్రభుత్వం. దీపావళి రోజు కూడా ఇలాగే దీపాలు మాత్రమే వెలిగించాలనే సందేశాన్ని ఇవ్వబోతోంది. సెప్టెంబర్ లో ఈ నిబంధన తీసుకొచ్చిన ప్రభుత్వం జనవరి 1 వరకు ఇది అమలులో ఉంటుందని తెలిపింది. అంటే దీపావళితోపాటు, డిసెంబర్-31, జనవరి 1 కొత్త సంవత్సరం రోజున కూడా టపాకాయల సందడి ఢిల్లీలో కనపడకూడదు, వినపడకూడదు. ఈ నిబంధనలు ఉల్లంఘిస్తే నేరుగా జైలుకే.

First Published:  19 Oct 2022 6:26 PM IST
Next Story