కొండచరియలు విరిగిపడి ఏడుగురు మృతి.. మృతుల్లో ఆరుగురు పోలీసులు
మృతిచెందిన పోలీసులు రెండో ఇండియన్ రిజర్వ్ బెటాలియన్ కు చెందినవారుగా గుర్తించారు. చంబా సరిహద్దులో వీరంతా విధులు నిర్వహిస్తున్నట్టు సమాచారం.
కొండచరియలు విరిగిపడటంతో పోలీసులు ప్రయాణిస్తున్న వాహనం ప్రమాదవశాత్తూ నదిలో పడిపోయింది. హిమాచల్ ప్రదేశ్‌లో గురువారం రాత్రి జరిగిన ఈ ఘటనలో ఆరుగురు పోలీసులు, మరో పౌరుడు మృత్యువాత పడ్డారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. చంబా జిల్లాకు చెందిన పోలీసులు కొంతమంది పౌరులతో కలిసి బైరాగడ్ నుంచి టిస్సా వైపు బయలుదేరారు. తార్వాయ్ బ్రిడ్జి వద్దకు రాగానే కొండచరియ విరిగి ఓ బండరాయి వారి వాహనంపైకి దూసుకొచ్చింది. దాని ధాటికి వాహనం అదుపు తప్పి సియుల్ నదిలో పడిపోయింది. ఈ ప్రమాదంలో ఆరుగురు పోలీసులు, ఒక పౌరుడు మృతిచెందగా, మరో నలుగురు తీవ్ర గాయాలపాలయ్యారు.
మృతిచెందిన పోలీసులు రెండో ఇండియన్ రిజర్వ్ బెటాలియన్ కు చెందినవారుగా గుర్తించారు. చంబా సరిహద్దులో వీరంతా విధులు నిర్వహిస్తున్నట్టు సమాచారం. మృతిచెందిన పోలీసుల్లో రాకేష్ గోరా, ప్రవీణ్ టాండన్, కమల్జీత్, సచిన్, అభిషేక్, అక్షయ్‌కుమార్‌లుగా గుర్తించారు. మృతిచెందిన పౌరుడు స్థానికుడైన చంద్రూరామ్ అని తేలింది.
ఈ ప్రమాద ఘటనపై హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ సుఖు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలను తక్షణం సాయం అందించాలని అధికారులను ఆదేశించారు. గాయపడినవారికి మెరుగైన వైద్యం అందించాలని సూచించారు.