Telugu Global
National

ఏప్రిల్-1నుంచి టోల్ మోత.. కేంద్రానికి తెలంగాణ ఘాటు లేఖ

కేంద్రం వాత పెట్టడానికే సై అంది. 5 శాతం వడ్డించింది. ఏప్రిల్-1నుంచి పెరిగిన టోల్ చార్జీలు అమలులోకి వస్తాయి.

ఏప్రిల్-1నుంచి టోల్ మోత.. కేంద్రానికి తెలంగాణ ఘాటు లేఖ
X

టోల్ మోత మోగింది.. టోల్ గేట్ చార్జీలను 5 శాతం పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ప్రతి ఏడాదీ ఏప్రిల్1 నుంచి టోల్ చార్జీలను పెంచడం ఆనవాయితీ. పెట్రోల్, డీజిల్ రేట్లు భారీగా పెరిగిపోవడంతో ఇప్పటికే నిత్యావసరాల రేట్లు చుక్కలనంటాయి, ఇక టోల్ రేట్లు కూడా పెరిగితే ఆ ప్రభావం మరింత ఎక్కువగా కనపడుతుంది. ఈ దశలో రేట్లు పెరగవనే అనుకున్నారంతా. కానీ కేంద్రం మాత్రం వాతపెట్టడానికే సై అంది. 5 శాతం వడ్డించింది. ఏప్రిల్-1నుంచి ఈ చార్జీలు అమలులోకి వస్తాయి.

కేంద్రానికి తెలంగాణ ఘాటు లేఖ..

కేంద్రం టోల్ ట్యాక్స్ ని పెంచడం మూలిగే నక్కపై తాటిపండు వేయడమేనని మండిపడ్డారు తెలంగాణ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి. ఇప్పటికే టోల్ ట్యాక్స్ తెలంగాణ ప్రజలకు పెను భారంగా మారిందని, ఇప్పుడు పెంచిన రేట్లు మరింత భారమవుతాయని చెప్పారాయన. ఈమేరకు కేంద్రమంత్రి నితిన్ గడ్కరీకి ఆయన లేఖ రాశారు.

2014లో తెలంగాణ నుంచి కేంద్రం 600 కోట్ల రూపాయలు టోల్ ట్యాక్స్ వసూలు చేసిందని, 2023లో అది 1824కోట్లకు చేరిందని చెప్పారు ప్రశాంత్ రెడ్డి. 9ఏళ్ల కాలంలో టోల్ ట్యాక్స్ ని 300 శాతం పెంచారని గుర్తు చేశారు. టోల్ పెంపువల్ల ట్రక్కుల ద్వారా సరఫరా చేసే నిత్యావసరాల ధరలు పెరిగాయని, సామాన్యులు ప్రయాణించే బస్సు చార్జీలు పెరిగాయని, దీంతో మధ్య తరగతి ప్రజల జీవనం మరింత భారంగా తయారైందని అన్నారు.

తప్పుడు లెక్కలెందుకు..?

తెలంగాణ నుంచి ఉన్న ఏకైక కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సహా ఇతర బీజేపీ నేతలు.. తెలంగాణ రాష్ట్రంలో జాతీయ రహదారుల కోసం కేంద్ర ప్రభుత్వం లక్షల కోట్లు ఖర్చు చేసిందంటూ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రకటనలు చేస్తున్నారని మండిపడ్డారు ప్రశాంత్ రెడ్డి. తెలంగాణ రాష్ట్రంలో జాతీయ రహదారుల కోసం మంజూరీలు కాగితాల మీద కొండంత ఉంటే, వాస్తవంలో అవి గోరంతేనని విమర్శించారు. 2014 నుంచి ఇప్పటి వరకు కాగితాలపై కేటాయింపులు రూ. 1,25,176 కోట్లుకాగా, అసలు ఖర్చు చేసింది రూ.20,350 కోట్లు మాత్రమేనన్నారు. ఇందులో 9వేలకోట్ల రూపాయలు తిరిగి టోల్ ట్యాక్స్ ద్వారా తెలంగాణ ప్రజలే కేంద్రానికి చెల్లించారు. అంటే.. సగం డబ్బుల్ని టోల్ గేట్ల ద్వారా ముక్కుపిండి వసూలు చేశారని, ఇక కేంద్రం కేటాయింపులెక్కడివని నిలదీశారు. పెట్రోల్, డీజిల్ పై వేసిన అదనపు రోడ్ సెస్సులు ఎవరి జేబులోకి వెళ్తున్నాయని నిలదీశారు ప్రశాంత్ రెడ్డి. టోల్ చార్జీల పెంపుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.

First Published:  30 March 2023 7:33 AM IST
Next Story