కొచ్చిన్ యూనివర్సిటీ ఫెస్ట్‌లో తొక్కిసలాట .. నలుగురి మృతి, 60 మందికి గాయాలు
దుర్ఘటనపై సీఎం పినరయ్ విజయన్ సంతాపం వ్యక్తం చేశారు. ఈ విషాదాన్ని దృష్టిలో ఉంచుకుని సీపీఎం చేపట్టిన నవ కేరళ సదస్సులో భాగంగా ఆదివారం జరగాల్సిన అన్ని ఉత్సవ కార్యక్రమాలను రద్దు చేశారు.
కేరళలోని ఓ ఇంజినీరింగ్ కాలేజీ నిర్వహించిన మ్యూజిక్ ఫెస్ట్‌లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. తొక్కిసలాటలో నలుగురు విద్యార్థులు ప్రాణాలు కోల్పోగా మరో 60 మంది గాయపడ్డారు. వీరిలో తీవ్రంగా గాయపడిన 15 మంది ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. ఇప్పటికీ కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
కొచ్చి యూనివర్సిటీ వార్షికోత్సవం సందర్భంగా యూనివర్సిటీ క్యాంపస్ ఓపెన్ ఎయిర్ థియేటర్‌లో శనివారం రాత్రి ప్రముఖ గాయని నికితా గాంధీ మ్యూజికల్ షో ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి విద్యార్థులు భారీగా హాజరయ్యారు. అయితే హఠాత్తుగా వర్షం కురవడంతో పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. వర్షం పెద్దగా పడటంతో బయట వేచి ఉన్నవారంతా ఒక్కసారిగా ఓపెన్-ఎయిర్ ఆడిటోరియంలో పరుగులు తీశారు. ఇది తొక్కిసలాటకు దారితీసింది. చాలామంది విద్యార్థులు జారి కిందపడిపోయారు. దీంతో ఇద్దరు యువకులు, ఇద్దరు యువతులు మృతి చెందారు. గాయపడిన విద్యార్థులను కలమస్సేరి ప్రభుత్వ వైద్య కళాశాలకు తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక, రెవెన్యూ , వైద్య సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
ఓపెన్ ఎయిర్ ఆడిటోరియం లోపలికి వెళ్లేందుకు, బయటికి వచ్చేందుకు ఒకే గేట్ ఉంది. పాసులు ఉన్న వాళ్లను ఆ ఒక్క గేటు నుంచే నిర్వాహకులు బ్యాచ్‌లవారిగా లోపలికి పంపారు. లోపలికి వెళ్లేందుకు పాసులు లేని యూనివర్సిటీకి సంబంధం లేని యువకులు పెద్ద సంఖ్యలో గేటు వద్ద వేచి ఉన్నారు. అయితే అదే సమయంలో పెద్దగా వర్షం పడింది. దీంతో ఒక్కసారిగా విద్యార్థులు పరుగులు తీశారు. అక్కడున్న మెట్ల మీది నుంచి కొందరు కిందపడ్డారు. పడిపోయిన వారి మీద నుంచి విద్యార్థులు పరుగులు తీయడంతోనే నలుగురు మరణించినట్టు పోలీసులు తెలిపారు.
యూనివర్సిటిలో తొక్కిసలాట ఘటనపై కోజికోడ్‌లోని ప్రభుత్వ అతిథి గృహంలో శనివారం రాత్రి ముఖ్యమంత్రి పినరయి విజయన్ అధ్యక్షతన మంత్రుల అత్యవసర సమావేశం నిర్వహించారు. దుర్ఘటనపై సీఎం పినరయ్ విజయన్ సంతాపం వ్యక్తం చేశారు. ఈ విషాదాన్ని దృష్టిలో ఉంచుకుని సీపీఎం చేపట్టిన నవ కేరళ సదస్సులో భాగంగా ఆదివారం జరగాల్సిన అన్ని ఉత్సవ కార్యక్రమాలను రద్దు చేశారు.
♦