గోవాలో ఘోరం.. - గుడిసెలపైకి బస్సు దూసుకెళ్లి నలుగురు కూలీల మృతి
రూపేందర్ మాథుర్ అనే కూలీ ఈ ఘటనకు ప్రత్యక్ష సాక్షిగా ఉన్నాడు. తనకు ఫోను రావడంతో గుడిసెలో నుంచి బయటికి వచ్చానని, తాను చూస్తుండగానే బస్సు వేగంగా వచ్చి రెండు గుడిసెల్లోకి దూసుకెళ్లిందని రూపేందర్ వివరించాడు.
గోవాలో ఘోర దుర్ఘటన చోటుచేసుకుంది. రోడ్డు పక్కన ఉన్న గుడిసెల్లోకి బస్సు దూసుకెళ్లడంతో నలుగురు కూలీలు మృతిచెందారు. ఈ ప్రమాదంలో మరో ఐదుగురు కూలీలు తీవ్రంగా గాయపడ్డారు. శనివారం అర్ధరాత్రి దక్షిణ గోవాలోని ఇండస్ట్రియల్ ఎస్టేట్ వద్ద ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.
వలస కూలీలు రోడ్డు పక్కన గుడిసెలు వేసుకొని నిద్రిస్తుండగా, అర్ధరాత్రి 11.30 గంటల సమయంలో ఒక బస్సు వారి గుడిసెల పైకి దూసుకొచ్చింది. ఈ ఘటనలో నలుగురు కూలీలు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడగా.. వారిని సమీపంలోని మెడికల్ కాలేజీ ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తరలించారు.
ఈ ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్న రూపేందర్ మాథుర్ అనే కూలీ ఈ ఘటనకు ప్రత్యక్ష సాక్షిగా ఉన్నాడు. తనకు ఫోను రావడంతో గుడిసెలో నుంచి బయటికి వచ్చానని, తాను చూస్తుండగానే బస్సు వేగంగా వచ్చి రెండు గుడిసెల్లోకి దూసుకెళ్లిందని రూపేందర్ వివరించాడు. డ్రైవర్ మద్యం మత్తులో ఉండడమే ప్రమాదానికి కారణమని అతను చెప్పాడు. ఈ ఘటనలో తన సోదరుడు, మామ ప్రాణాలు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. పోలీసులకు ఫిర్యాదు చేస్తే చంపేస్తానని డ్రైవర్ బెదిరించాడని అతను వాపోయాడు. గాయపడినవారికి చికిత్స అందించడంలో వైద్య సిబ్బంది జాప్యం చేయడంతో వారి పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు. ప్రమాదానికి కారణమైన బస్సు డ్రైవర్‌ని అరెస్టు చేశామని వారు చెప్పారు.