రోగం నయం చేస్తారని స్వామీజీ దగ్గరకెళితే.. బంగారం పోయింది..!
సరిగ్గా అదే సమయంలో పలువురు భక్తుల మెడల్లోని బంగారు ఆభరణాలు చోరీకి గురయ్యాయి. తన మంగళసూత్రం కూడా పోయిందంటూ ఓ భక్తురాలు వాపోవడం గమనార్హం.
స్వామీజీ రోగాలను నయం చేస్తారనే ఆశతో వెళ్లిన భక్తులకు చేదు అనుభవం ఎదురైంది. దాదాపు రెండు లక్షల మంది పాల్గొన్న ఓ కార్యక్రమంలో సరైన భద్రతా ఏర్పాట్లు చేయకపోవడంతో తోపులాట జరిగింది. ఈ సందర్భంగా పలువురు భక్తుల బంగారం చోరీకి గురైంది. బంగారం పోగొట్టుకున్న బాధితులు మొత్తం 36 మంది ఉన్నట్టు తేలింది.
స్వయం ప్రకటిత స్వామీజీ ధీరేంద్ర కృష్ణ శాస్త్రి ముంబైలో నిర్వహించిన ఈవెంట్‌లో ఆదివారం సాయంత్రం ఈ ఘటన జరిగింది. సల్సార్ సెంట్రల్ పార్కు గ్రౌండ్‌లో శని, ఆదివారాల్లో ఏర్పాటు చేసిన ఈ ఈవెంట్‌కి దాదాపు రెండు లక్షల మంది భక్తులు హాజరయ్యారు. అందుకు తగినట్టుగా నిర్వాహకులు భద్రతా ఏర్పాట్లు చేయలేదు. దీంతో వేలాదిమంది భక్తుల మధ్య తోపులాట జరిగి గందరగోళం నెలకొంది.
సరిగ్గా అదే సమయంలో పలువురు భక్తుల మెడల్లోని బంగారు ఆభరణాలు చోరీకి గురయ్యాయి. తన మంగళసూత్రం కూడా పోయిందంటూ ఓ భక్తురాలు వాపోవడం గమనార్హం. స్వామీజీ రోగాలను నయం చేస్తారని ఫోన్లో వీడియోలు చూసి ఇక్కడకు వెళ్లినట్లు చెప్పింది. తన రెండేళ్ల బిడ్డ ఆరోగ్యం బాగాలేదని, స్వామీజీ దగ్గరకు తీసుకెళ్తే నయం చేస్తారని కార్యక్రామానికి వచ్చినట్లు పేర్కొంది. స్వామీజీ కార్యక్రమంలో ఇలా జరుగుతుందని ఊహించలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు.