Telugu Global
National

మహాప్రభో మా పేర్లు తొలగించండి.. NCERTకి విద్యావేత్తల అభ్యర్థన

ప్రభుత్వం ముద్రించే పుస్తకాల్లో తమ పేర్లు ఉండటం విద్యావేత్తలకు ఎంతో గర్వకారణం. అలాంటి వారే ఇప్పుడు తమ పేర్లు వద్దు మహాప్రభో అంటూ లేఖలు రాస్తున్నారంటే పరిస్థితి ఎంత దిగజారిపోయిందో అర్థం చేసుకోవచ్చు.

మహాప్రభో మా పేర్లు తొలగించండి.. NCERTకి విద్యావేత్తల అభ్యర్థన
X

చరిత్రకు కొత్త భాష్యాలు చెప్పడం, కాషాయీకరించడం బీజేపీ హయాంలో జరుగుతున్నదే. అయితే ఇటీవల ఈ వికృత క్రీడ పాఠ్యపుస్తకాలకు కూడా పాకింది. ప్రభుత్వ పాఠ్యపుస్తకాలకు సిలబస్ ఖరారు చేసే NCERT కూడా రాజకీయాలకు ప్రభావితమవుతోంది. సిలబస్ లో మార్పులు చేర్పులు బీజేపీకి అనూకూలంగా జరుగుతున్నాయి. మొఘలుల చరిత్రను పుస్తకాలనుంచి తొలగించారు. కరోనా తర్వాత విద్యార్థులపై ఒత్తిడి తగ్గించేందుకు అనే నెపంతో.. నాటి స్వాతంత్ర పోరాటంలో కూడా కొన్ని కీలక అధ్యాయాలు కనుమరుగవుతున్నాయి. అయితే ఈ పాపం తమ చేతికి అంటించడంపై కొంతమంది విద్యావేత్తలు మండిపడుతున్నారు. NCERT పాఠ్యపుస్తకాల్లో రచయితలుగా తమ పేరు తొలగించాలంటూ మొత్తం 33మంది విద్యావేత్తలు తాజాగా రాసిన లేఖ సంచలనంగా మారింది.

సిలబస్ లో NCERT చేసిన మార్పులపై అసహనం వ్యక్తం చేస్తూ 9 నుంచి 12 తరగతుల వరకు చరిత్ర పుస్తకాలకు ముఖ్య సలహాదారులుగా ఉన్న సుహాస్ పల్షికర్, యోగేంద్ర యాదవ్ తమ పేర్లను తొలగించాలని ఇటీవలే కౌన్సిల్ కు లేఖ రాశారు. ఆ లేఖ కలకలం రేపిన రెండు రోజులకే 33మంది విద్యావేత్తలు కూడా తమ పేర్లు తొలగించాలని లేఖ రాయడం మరింత సంచలనంగా మారింది.

ఎందుకీ అవస్థ..?

ప్రభుత్వం ముద్రించే పుస్తకాల్లో రచయితలు, సలహాదారులుగా తమ పేర్లు ఉండటం విద్యావేత్తలకు ఎంతో గర్వకారణం. అలాంటి వారే ఇప్పుడు తమ పేర్లు వద్దు మహాప్రభో అంటూ లేఖలు రాస్తున్నారంటే పరిస్థితి ఎంత దిగజారిపోయిందో అర్థం చేసుకోవచ్చు. చరిత్రను వక్రీరిస్తూ.. ఆ వక్రభాష్యాలకు తమని కర్తలుగా ముందు పెట్టడం ఎంతవరకు భావ్యమని వారు ప్రశ్నిస్తున్నారు. అందుకే తమని ఆ పాపం నుంచి తొలగించాలని విన్నవిస్తున్నారు.

అశోక యూనివర్శిటీ వైస్ ఛాన్సలర్, రాజకీయ శాస్త్రవేత్త ప్రతాప్ భాను మెహతా, ఢిల్లీ యూనివర్శిటీకి చెందిన రాధికా మీనన్, జవహర్‌ లాల్ నెహ్రూ యూనివర్శిటీకి చెందిన నివేదిత మీనన్, కాంతి ప్రసాద్ బాజ్‌పాయ్.. తదితరులతో కూడిన 33మంది విద్యావేత్తలు తాజాగా లేఖ రాశారు. ఈ లేఖతో సిలబస్ వక్రీకరణ దేశవ్యాప్తంగా మరోసారి చర్చనీయాంశమైంది.

First Published:  16 Jun 2023 6:25 PM IST
Next Story