Telugu Global
National

పూరీ జగన్నాథ్‌ రథయాత్ర కోసం 315 ప్రత్యేక రైళ్లు..

ఈ ఉత్సవాల నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే జోన్‌ నుంచి కూడా కొన్ని ప్రత్యేక రైళ్లను నడిపే అవకాశం ఉంది. దానికి సంబంధించి ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటనా రాలేదు.

పూరీ జగన్నాథ్‌ రథయాత్ర కోసం 315 ప్రత్యేక రైళ్లు..
X

పూరీ జగన్నాథుడి రథయాత్ర సందర్భంగా జూలై 6 నుంచి 19 వరకు జరగనున్న మహోత్సవాల కోసం 315 ప్రత్యేక రైళ్లను నడపాలని రైల్వే శాఖ నిర్ణయించింది. ఈ మహోత్సవాలకు భక్తుల రద్దీ భారీగా ఉండే అవకాశముంది. ఈ నేపథ్యంలో రైల్వే శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఒడిశా ముఖ్యమంత్రి మోహన్‌ చరణ్‌ మారి, డిప్యూటీ సీఎంలు కనకవర్ధన్‌ సింగ్‌ దేవ్, ప్రభాతి పరిడలకు రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ సమాచారమిచ్చారు.

ఈ మహోత్సవాల నేపథ్యంలో ఒడిశాలోని అన్ని ప్రధాన పట్టణాల మీదుగా రైళ్లు నడిచేలా అధికారులు రూట్‌ మ్యాప్‌ సిద్ధం చేస్తున్నారు. జునాగఢ్‌ రోడ్, సంబల్పూర్, కేందుజుహర్‌ గఢ్, పారాదీప్, భద్రక్, బాదం పహాడ్, రూర్కెలా, బాలేశ్వర్, సోనేపుర్, అనుగుల్, దసపల్లా, గుణుపుర్‌ నుంచి ప్రత్యేక రైళ్లు ప్రారంభమవుతాయని ఈస్ట్‌ కోస్ట్‌ రైల్వే ఓ ప్రకటనలో వెల్లడించింది. సంధ్యా దర్శన్, బహుదా యాత్రకు వచ్చే భక్తుల కోసం కూడా ప్రత్యేక రైళ్లను నడిపేలా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు పేర్కొంది.

ఈ ఉత్సవాల నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే జోన్‌ నుంచి కూడా కొన్ని ప్రత్యేక రైళ్లను నడిపే అవకాశం ఉంది. దానికి సంబంధించి ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటనా రాలేదు. వేడుకలు కొనసాగినన్నాళ్లూ భక్తులతో పూరీ రైల్వే స్టేషన్‌ రద్దీగా మారే అవకాశమున్న నేపథ్యంలో మౌలిక సదుపాయాల కల్పనకు కృషిచేస్తున్నట్టు ఈస్ట్‌ కోస్ట్‌ రైల్వే జనరల్‌ మేనేజర్‌ ఫకువాల్‌ తెలిపారు. రైల్వేశాఖ తరఫున సుమారు 15 వేల మంది భక్తులకు ఆశ్రయం కల్పించేందుకు వీలుగా ఏర్పాట్లు చేస్తున్నట్టు ఆయన చెప్పారు.

ఆనవాయితీ ప్రకారం జగన్నాథుడు.. సోదరుడు బలభద్రుడు, సోదరి సుభద్రతో కలిసి గుండిచా మందిరానికి మూడు వేర్వేరు రథాల్లో చేరుకుంటారు. ఆషాఢ శుక్ల పక్షమి హరిశయన ఏకాదశి రోజున నిర్వహించే ఈ అపురూప ఘట్టం కోసం లక్షలాది మంది ఎదురు చూస్తుంటారు. ఈ నేపథ్యంలో ఆ రోజున పెద్ద మొత్తంలో రైళ్లు నడపాలని అధికారులు భావిస్తున్నారు.

First Published:  1 July 2024 8:35 AM IST
Next Story