భారతీయ రైల్వేలో 3.12 లక్షల పోస్టులు ఖాళీగా ఉన్నాయి: ప్రభుత్వ డేటా చెప్తున్న నిజాలు
గత ఏడాది మార్చిలో రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ అన్ని పోస్టులకు సిబ్బంది కొరత ఉందని చెప్పారు. అయితే ఇప్పటికీ అదే పరిస్థితి కొనసాగుతోంది.
భారతీయ రైల్వేలో దేశవ్యాప్తంగా 3.12 లక్షల నాన్ గెజిటెడ్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని ప్రభుత్వ డేటా బహిర్గతపర్చింది. ఈ విషయాన్ని ది హిందూ నివేదించింది.
గత ఏడాది మార్చిలో రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ అన్ని పోస్టులకు సిబ్బంది కొరత ఉందని చెప్పారు. అయితే ఇప్పటికీ అదే పరిస్థితి కొనసాగుతోంది.
రాజ్యసభలో ఓ ప్రశ్నకు మంత్రి ఇచ్చిన సమాధానం ప్రకారం, డిసెంబర్ 1, 2022 నాటికి, భారతీయ రైల్వేలో దేశవ్యాప్తంగా 18 జోన్లలో 3.12 లక్షల నాన్-గెజిటెడ్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
ఉత్తర జోన్‌లో 38,754 పోస్టులు, పశ్చిమ జోన్ లో30,476 పోస్టులు, తూర్పు జోన్ లో 30,141పోస్టులు, సెంట్రల్ జోన్‌లో 28,650 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
నాన్ గెజిటెడ్ పోస్టుల్లో ఇంజనీర్లు, టెక్నీషియన్లు, క్లర్కులు, స్టేషన్ మాస్టర్లు, టికెట్ కలెక్టర్లు మొదలైన ఉద్యోగాలు ఉంటాయి.
భారతీయ రైల్వేలలో సిబ్బంది కొరత కారణంగా చాలా మంది ఉద్యోగులు ఓవర్ టైం పని చేస్తున్నారు. అనేక టిక్కెట్ బుకింగ్ కౌంటర్లు క్లోజ్ చేసి ఉంటున్నాయి. దీని వల్ల ఏ రైల్వే స్టేషన్ లో చూసినా అతి పొడవైన ప్రయాణీకుల క్యూలు కనపడుతున్నాయని హిందూ వార్తాపత్రిక నివేదించింది.
“నేను 16 గంటల వరకు డబుల్ షిఫ్టులలో పని చేస్తున్నాను, ఎందుకంటే మమ్మల్ని రిలీవ్ చేయడానికి సిబ్బంది లేరు. సిబ్బంది కొరత కారణంగా నేను చదువుకోడానికి సెలవు తీసుకోలేకపోయాను” అని ముంబైలోని సెంట్రల్ రైల్వే టికెట్ బుకింగ్ కార్యాలయంలో 29 ఏళ్ల ఉద్యోగి హిందూతో చెప్పారు.
ఉద్యోగి లా పరీక్షలకు సిద్ధమవుతున్నాడు. అతను పరీక్ష పాసైన తర్వాత, న్యాయ విభాగానికి ఇంటర్-డిపార్ట్‌మెంటల్ బదిలీ కోసం ప్రయత్నించనున్నట్టు హిందూ నివేదించింది.
సెంట్రల్ రైల్వేలో ఖాళీగా ఉన్న దాదాపు 28,650 పోస్టుల్లో 14,203 ఖాళీలు కేవలం సేఫ్టీ కేటగిరీలోనే ఉన్నాయి. ఈ విభాగాల్లోని ఉద్యోగాలలో వివిధ రకాల ఇన్‌స్పెక్టర్లు, డ్రైవర్లు, రైలు ఎగ్జామినర్లు, షంటర్‌ల వంటి నిర్వహణ సిబ్బంది ఉన్నారు.
రైల్వేలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ గత ఏడాది నవంబర్ చివరిలో సెంట్రల్ రైల్వేకి చెందిన నేషనల్ రైల్వే మజ్దూర్ యూనియన్ (ఎన్‌ఆర్‌ఎంయు) ముంబయ్ లోని ఛత్రపతి శివాజీ టెర్మినస్‌లో శాంతియుత నిరసన చేపట్టింది.
1.19 లక్షల మంది కార్మికులలో 24% ఉద్యోగాలు దాదాపు ఏడాది కాలంగా ఖాళీగా ఉన్నాయని హిందుస్థాన్ టైమ్స్ నివేదించింది.
ప్రభుత్వం ఖాళీలను భర్తీ చేయనందున, చాలా మంది ఓవర్‌టైమ్‌లు పని చేయాల్సి వస్తోందని, ఉద్యోగాలు భర్తీ కానందువల్ల చాలా మందికి ప్రమోషన్లు కూడా రావడంలేదని హిందుస్థాన్ టైమ్స్ పేర్కొంది. ఈ సమస్యలు రైళ్ల పనితీరు, ట్రాక్‌ల నిర్వహణపై ప్రభావం చూపుతున్నాయి, అందువల్ల ప్రయాణీకుల భద్రత ప్రమాదంలో పడింది.
నేషనల్ రైల్వే మజ్దూర్ యూనియన్ కు చెందిన ఓ కార్మికుడు 'హిందూ'తో మాట్లాడుతూ, సిబ్బంది కొరత కారణంగా టికెటింగ్ సేవలను కూడా ఔట్‌సోర్సింగ్‌కి అప్పగించారు. “రైల్వే టిక్కెట్ బుకింగ్ విండో వెలుపల విక్రయించే ప్రతి రూ. 100 విలువైన టిక్కెట్‌లపై రూ. 3 కమీషన్ తీసుకునే ప్రైవేట్ పార్టీలను నియమించింది. '' అని అన్నారు.
అయితే రైల్వే మంత్రిత్వ శాఖ పార్లమెంటులో సమర్పించిన అధికారిక నివేదిక చెప్పింది పూర్తిగా విరుద్దంగా ఉంది. “ఖాళీలు ఏర్పడినప్పుడు భర్తీ చేయడం నిరంతర ప్రక్రియ. అవసరాల ప్రకారం ఖాళీలను ప్రమోషన్ ల ద్వారా, రిక్రూటింగ్ ఏజెన్సీలతో ప్లేస్‌మెంట్ ద్వారా భర్తీ చేస్తారు. ." అని మంత్రిత్వ శాఖ చెప్పింది.
"ఖాళీ అయిన 35,281 పోస్టులకు డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ పూర్తయింది." అని ఆ శాఖ పార్లమెంటుకు చెప్పింది.
జనవరి 2022లో రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ ఎంపిక ప్రక్రియపై వేలాది మంది ఉద్యోగ ఆశావాదులు అనేక నిరసనలు వ్యక్తం చేశారు. 40,000 ఉద్యోగాల కోసం 1 కోటి మంది దరఖాస్తుదారులు ఇప్పటికీ ఎదిరి చూస్తున్నారు. ఒక సంవత్సరం తర్వాత ఇప్పుటికీ ఆ ఖాళీలు భర్తీ అవలేదు.