30 లక్షల ఈవీఎంలు ఉంటేనే వన్ నేషన్ - వన్ ఎలక్షన్
దేశమంతా ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలంటే 30 లక్షల సీయూలు, 43 లక్షల బ్యాలెట్ యూనిట్లు, 32 లక్షల వీవీప్యాట్లు కావాలి. అంతేకాదు ఈ భారీ క్రతువు నిర్వహణకు కనీసం ఏడాదిన్నరపాటు భారీ కసరత్తు కూడా ఉండాలని ఈసీ చెబుతోంది.
వన్ నేషన్.. వన్ ఎలక్షన్.. దేశమంతా ఒకేసారి ఎన్నికల నిర్వహించాలంటే ఏం కావాలనే దానిపై కేంద్ర ప్రభుత్వం గట్టి కసరత్తు చేస్తోంది. దీనిపై న్యాయ కమిషన్ అడిగిన సమాచారం మేరకు ఎన్నికల సంఘం అధికారులు మదింపు చేశారు. లోక్‌సభతోపాటు దేశమంతా అన్ని రాష్ట్రాల శాసనసభలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలంటే ఏకంగా 30 లక్షల ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్లు(ఈవీఎంలు) కావాలని లెక్కగట్టి చెప్పారు.
43 లక్షల బ్యాలెట్ యూనిట్లు.. 32 లక్షల వీవీపాట్లు కావాలి
ఒక ఈవీఎంలో ఒక కంట్రోల్ యూనిట్ (సీయూ), ఒక బ్యాలెట్ యూనిట్ (బీయూ), ఒక ఓటర్ వెరిఫైబుల్ పేపర్ ఆడిట్ ట్రైల్ (వీవీ ప్యాట్) ఉంటాయి. ఈసీ న్యాయ కమిషన్‌కు చెప్పిన వివరాల ప్రకారం.. దేశమంతా ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలంటే 30 లక్షల సీయూలు, 43 లక్షల బ్యాలెట్ యూనిట్లు, 32 లక్షల వీవీప్యాట్లు కావాలి. అంతేకాదు ఈ భారీ క్రతువు నిర్వహణకు కనీసం ఏడాదిన్నరపాటు భారీ కసరత్తు కూడా ఉండాలని ఈసీ చెబుతోంది.
మన దగ్గర ఉన్నవి 75 శాతమే
ఈ ఏడాది మార్చి నాటికి దేశం మొత్తం మీద 13.06 లక్షల కంట్రోల్ యూనిట్లు, 17.77 లక్షల బ్యాలెట్ యూనిట్లు ఉన్నాయని పార్లమెంట్‌లో కేంద్రం ప్రకటించింది. మరో 9.09 లక్షల కంట్రోల్ యూనిట్లు, 13.26 లక్షల బ్యాలెట్ యూనిట్లు తయారీలో ఉన్నాయని చెప్పారు. అన్నీ కలిపితే 22 లక్షల సీయూలు, 31 లక్షల బీయూలు అవుతాయి. అంటే మొత్తం అవసరంలో 75 శాతమే ఉన్నట్లు. ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించాలంటే ఇంకో 25 శాతం ఈవీఎంలు సమకూర్చుకోవాల్సి ఉంటుందన్నమాట.