కదులుతున్న రైలులో ఘాతుకం.. ప్రయాణికుడిపై పెట్రోల్ పోసి నిప్పు.. - ముగ్గురి మృతి.. 8 మందికి గాయాలు
పలువురు ప్రయాణికులు అప్రమత్తమై చైన్ లాగి రైలును నిలిపివేశారు. మంటలను ఆర్పివేశారు. సమాచారం అందుకుని అక్కడికి చేరుకున్న రైల్వే పోలీసులు గాయపడిన 8 మంది ప్రయాణికులను ఆస్పత్రికి తరలించారు.
కేరళ రాష్ట్రంలో కదులుతున్న రైలులో ఘాతుకం చోటుచేసుకుంది.. ఓ ప్రయాణికుడిపై పెట్రోల్ పోసి నిప్పంటించిన ఘటనలో ముగ్గురు మృతిచెందగా, మరో 8 మందికి గాయాలయ్యాయి. ఆదివారం రాత్రి 10 గంటల ప్రాంతంలో అలప్పుజ - కన్నూరు ఎక్స్‌ప్రెస్ రైలులో ఈ ఘటన జరిగింది. పోలీసుల కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి.
అలప్పుజ - కన్నూరు ఎక్స్‌ప్రెస్ రైలులో ఆదివారం రాత్రి ఓ వ్యక్తి తోటి ప్రయాణికుడితో వాగ్వివాదానికి దిగాడు. ఈ నేపథ్యంలో రైలు కోజికోడ్ నగరాన్ని దాటి కోరపుళ రైలు వంతెన వద్దకు చేరుకునేసరికి అతనిపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ప్రయాణికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. మంటలు చుట్టుపక్కల ఉన్న పలువురికి వ్యాపించడంతో ఒక్కసారిగా భయంతో అందరూ కేకలు వేశారు.
పలువురు ప్రయాణికులు అప్రమత్తమై చైన్ లాగి రైలును నిలిపివేశారు. మంటలను ఆర్పివేశారు. సమాచారం అందుకుని అక్కడికి చేరుకున్న రైల్వే పోలీసులు గాయపడిన 8 మంది ప్రయాణికులను ఆస్పత్రికి తరలించారు. అనంతరం రైలులో మరో ముగ్గురు ప్రయాణికులు కనిపించడం లేదని తోటివారు గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించగా, వారు వెంటనే గాలింపు చేపట్టారు. ఘటన జరిగిన ప్రాంతానికి సుమారు 100 మీటర్ల దూరంలో ట్రాక్‌పై ముగ్గురి మృతదేహాలు కనిపించాయి. వీరిలో ఒక మహిళ, పురుషుడుతో పాటు ఏడాది చిన్నారి కూడా ఉంది. ఘటన జరిగిన సమయంలో తప్పించుకునేందుకు రైలు నుంచి కిందికి దిగేందుకు ప్రయత్నించడం లేదా జారి పడిపోవడం వల్ల వారు మృతిచెంది ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతులంతా ఒకే కుటుంబానికి చెందినవారుగా భావిస్తున్నారు.
ఉగ్ర కుట్ర అనుమానాలు..
ఘటన జరిగిన అనంతరం ప్రయాణికులు చైన్ లాగడంతో రైలు ఆగిపోయింది. దీంతో నిందితుడు వెంటనే రైలు నుంచి దూకి పరారయ్యాడని ప్రత్యక్ష సాక్షులు పోలీసులకు వెల్లడించారు. అప్పటికే ఒక వ్యక్తి నిందితుడి కోసం బైక్‌పై వేచి చూడటం తాము గమనించామని వారు తెలిపారు. దీంతో ఈ ఘటన వెనుక ఉగ్ర కుట్ర దాగి ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటనాస్థలిలో అనుమానాస్పద స్థితిలో ఓ బ్యాగు ఉండటాన్ని పోలీసులు గుర్తించారు. అందులో మరో పెట్రోల్ బాటిల్, రెండు సెల్ ఫోన్లు ఉండటాన్ని గుర్తించి వాటిని స్వాధీనం చేసుకున్నారు. పెట్రోల్‌తో దాడికి ముందు నిందితుడు తోటి ప్రయాణికుడితో కావాలనే గొడవ పెట్టుకున్నట్టు ప్రత్యక్ష సాక్షులు పోలీసులకు వెల్లడించారు.