ఇది బద్దక భారతం.. రూ.25,600 కోట్ల భారం.... డబ్ల్యుహెచ్ఓ సర్వేరిపోర్టు
భారత్ లో సోమరులవల్ల రూ.25,600 కోట్ల భారం పడుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. బద్దకం వల్ల అనారోగ్యం పెరుగుతూ పలు రోగాలు సంక్రమిస్తున్నాయి. వాటిని బాగు చేయించుకోవడానికి కోట్లాది రూపాయలను ఖర్చు చేయాల్సివస్తోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యుహెచ్ ఓ) తెలిపింది.
ఆరోగ్యమే మహా భాగ్యం అన్నారు పెద్దలు. కానీ నేటి భారతంలో అనారోగ్యం పెరుగుతూ పలు రోగాలు సంక్రమిస్తున్నాయి. వాటిని బాగు చేయించుకోవడానికి కోట్లాది రూపాయలను ఖర్చు చేయాల్సివస్తోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యుహెచ్ ఓ) తెలిపింది. అలాగే ఇలా అనారోగ్యం పెరగడానికి కారణం వ్యాయామం కానీ ఇతర శారీరక శ్రమకానీ లేకపోవడమే అని తేల్చింది. ఏ వయసువారైనా దానికి తగ్గట్టు వ్యాయామం లేకపోవడంతో బద్ధకంగా వ్యవహరించడం వల్ల చికిత్స ఖర్చు భారం కోట్లలో పడుతోందని డబ్ల్యుహెచ్ఓ నిర్వహించిన సర్వే వెల్లడించింది.
మనదేశంలో 11-17 మధ్య వయస్సువారిలో 74 శాతం మంది శారీరక శ్రమ చేయడం లేదు. ఇలా శారీరక శ్రమ లేనివాళ్ళలో బాలురు 72 శాతం బాలికలు 76 శాతం ఉన్నారని సర్వేలో తేలింది. విద్యా ససంస్థల్లో పిల్లలకు ఆటపాటలకు చాలినంత స్థలం లేకపోవడం కూడా వారి శారీరక వ్యాయామానికి అవకాశం ఉండడం లేదనేది వాస్తవం. 18 ఏళ్లు పైబడిన వారిలో మహిళలు 44 శాతం, పురుషులు 25 శాతం వ్యాయామం చేయడం లేదని ఆ నివేదిక పేర్కొంది..
70 ఏళ్లు పైబడిన వారిలో మహిళలు 60 శాతం మంది, పురుషులు 38 శాతం శారీరక శ్రమ చేయడం లేదు. శారీరక శ్రమ చేయకపోవడం వల్ల ధీర్ఘకాలిక రోగాలైన బీపీ, షుగర్ పక్షవాతం గుండె, క్యాన్సర్ వంటి వాటితో పాటు మానసిక రుగ్మతలు కూడా తలెత్తే ప్రమాదం ఉంది. వీటిని నయం చేయించుకునేందుకు దేశంలో ఏడాదికి రూ.25,600 కోట్ల ఖర్చు అవుతోంది. వచ్చే పదేళ్లలో అది ఏకంగా రూ.2.5 లక్షల కోట్లకు చేరవచ్చని అంచనా వేసింది డబ్ల్యుహెచ్ ఓ.
శారీరక శ్రమ లేకపోవడంతో అధిక బరువు పెరగడం, దాని వల్ల పైన పేర్కొన్నటువంటి వ్యాధుల బారిన పడడం జరుగుతోంది. ప్రస్తుతం మన దేశంలో ఈ బరువుతో వచ్చిన దీర్ఘకాలికవ్యాధులతో చనిపోయేవారు 66 శాతం ఉంటున్నారని సర్వే తేల్చింది. మొత్తం మరణాల్లో 30శాతం గుండెకు సంబంధించినవే కావడం గమనార్హం. ఆ తర్వాత ఊపిరితిత్తుల వ్యాధులు, క్యాన్సర్, షుగర్ ఇతర వ్యాధులతో చనిపోతున్నారని పేర్కొంది. రాబోయే 10 యేళ్ళలో 47 శాతం బిపి వ్యాధిగ్రస్తులు పెరగుతారని ఇది కేవలం శారీరక వ్యాయామం లేకపోవడంవల్లనేనని డబ్ల్యుహెచ్ ఓ నివేదిక తెలిపింది.