మైనారిటీల హత్య కేసులో.. నిందితులంతా నిర్దోషులే.. - గుజరాత్ కోర్టు తీర్పు
ఈ కేసులో 8 మంది నిందితులు ఇప్పటికే మృతిచెందారు. 2002 ఫిబ్రవరి 27న గోద్రా పట్టణంలో సబర్మతి ఎక్స్‌ప్రెస్‌ను కొందరు దుండగులు తగలబెట్టిన ఘటనలో 59 మంది సజీవదహనమయ్యారు.
గుజరాత్ రాష్ట్రంలోని గోద్రా అల్లర్ల సందర్భంగా ఇద్దరు పిల్లలు సహా 17 మంది మైనారిటీలను హతమార్చిన కేసులో నిందితులందరూ నిర్దోషులేనని అక్కడి కోర్టు తీర్పునిచ్చింది. గుజరాత్ రాష్ట్రం పంచమహల్ జిల్లాలోని హలోల్ టౌన్ కోర్టు మంగళవారం ఈ తీర్పు చెప్పింది. ఈ కేసులో నిందితులను దోషులుగా గుర్తించేందుకు తగిన ఆధారాలు లేవని వెల్లడించింది. అడిషనల్ సెషన్స్ న్యాయమూర్తి హర్ష్ త్రివేది వారిని విడుదల చేస్తూ తీర్పు వెలువరించారు.
ఈ కేసులో 8 మంది నిందితులు ఇప్పటికే మృతిచెందారు. 2002 ఫిబ్రవరి 27న గోద్రా పట్టణంలో సబర్మతి ఎక్స్‌ప్రెస్‌ను కొందరు దుండగులు తగలబెట్టిన ఘటనలో 59 మంది సజీవదహనమయ్యారు. వారిలో అయోధ్య నుంచి తిరిగివస్తున్న కరసేవకులే ఎక్కువమంది. ఈ ఘటన అనంతరం గుజరాత్‌లోని పలు ప్రాంతాల్లో పెద్ద ఎత్తున మత ఘర్షణలు చెలరేగాయి. 2002 ఫిబ్రవరి 28న డెలొల్ గ్రామంలో 17 మంది మైనారిటీలు హత్యకు గురయ్యారు. అనంతరం ఆధారాలు దొరకకుండా వారి మృతదేహాలను నిందితులు తగులబెట్టారు. అప్పటినుంచి దీనిపై కోర్టులో కేసు కొనసాగుతుండగా, తాజాగా దీనిపై న్యాయమూర్తి తీర్పు వెలువరించారు. ఈ తీర్పు వివరాలను డిఫెన్స్ న్యాయవాది గోపాల సిన్హా సోలంకి వెల్లడించారు.