బస్సు లోయలో పడి 21 మంది మృతి, జమ్మూకశ్మీర్లో ఘోరం
జమ్మూకశ్మీర్‌లో ఘోర ప్రమాదం జరిగింది. పూంఛ్ రహదారిపై అఖ్నూర్‌లోని చుంగి మోర్ ప్రాంతంలో బస్సు అదుపుతప్పి లోయలో పడిన ఘటనలో మృతుల సంఖ్య 21కి చేరింది.
జమ్మూకశ్మీర్లో ఘోర ప్రమాదం జరిగింది. పూంఛ్ రహదారిపై అఖ్నూర్‌లోని చుంగి మోర్ ప్రాంతంలో బస్సు అదుపుతప్పి లోయలో పడిన ఘటనలో మృతుల సంఖ్య 21కి చేరింది. ఈ ఘటనలో మరో 47 మంది ప్రయాణికులు గాయపడ్డట్లు సమాచారం. ప్రయాణికులతో వెళ్తున్న బస్సు ప్రయాదవశాత్తు లోయలోపడి పోయింది.ఈ బస్సులో ఉత్తర ప్రదేశ్‌లోని హత్రాస్‌కు చెందిన సుమారు 75 మంది ప్రయాణికులు ఉన్నారు. వారు జమ్ము నుంచి రియాసీ జిల్లాలోని శివ్ ఖోరికి వెళుతున్నారు. స్థానికుల సహాయంతో పోలీసులు సహాయక చర్యలు చేపట్టి.. క్షతగాత్రులను అఖ్నూర్ ఉప జిల్లాసుపత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడినవారిని జమ్మూలోని ప్రభుత్వ వైద్య కళాశాలకు తరలించారు.
శివఖోడి ధామ్ జమ్మూ డివిజన్‌లోని రియాసి జిల్లాలోని పౌనిలో ఉన్నది. ఇది కత్రాలోని మాతా వైష్ణో దేవి ఆలయానికి కేవలం 80 కిలోమీటర్ల దూరంలో ఉంది. బస్సు వెళ్తున్న సమయంలో ప్రమాదకరమైన మూలమలుపు ఉండగా డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో లోయలోకి దూసుకెళ్లినట్లు తెలుస్తోంది. బస్సు లోయలో పడిపోయినప్పుడు పెద్దఎత్తున అరుపులు, కేకలు వేయడంతో సమీప ప్రాంతాల ప్రజలు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పోలీసులతో కలుసు సహాయక చర్యలలో పాల్గొన్నారు. గాయపడిన వారిని బస్సు అద్దాలు పగలగొట్టి రోడ్డుపైకి తీసుకువచ్చారు.
ప్రమాదంపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా సంతాపం ప్రకటించారు. ప్రమాదంపై ప్రధాని మోదీ సైతం స్పందించారు. ఈ ఘటనలో చాలామంది ప్రాణాలు కోల్పోవడం బాధ కలిగించిందన్నారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. బస్సు ప్రమాదంలో మృతి చెందిన కుటుంబాలకు రూ.2 లక్షలు, క్షతగాత్రులకు రూ.50వేలు ఎక్స్‌గ్రేసియా ప్రకటించారు.