Telugu Global
National

నీళ్ల మీద తారురోడ్డు వేశారంట‌..

అయితే ఊరు మొత్తం నీళ్లు ఉన్నా.. అధికారులు మాత్రం తారు రోడ్లు వేసినట్టు బిల్లులు పెట్టారు. అంతే కాదు, కాంక్రీట్ తో స్కూల్ బిల్డింగ్ కట్టినట్టు లెక్క చూపారు.

నీళ్ల మీద తారురోడ్డు వేశారంట‌..
X

ఆ ఊరిలో అధికారులు రోడ్లు వేశారు, స్కూల్ బిల్డింగ్ కూడా కట్టారు, మిగిలిన నిధులను 110మంది లబ్ధిదారులకు పంచిపెట్టారు. కేంద్ర ప్రభుత్వం ప్రధాన మంత్రి ఆదర్శ్ గ్రామ్ యోజన కార్యక్రమం కింద 20 లక్షల రూపాయల నిధులు విడుదల చేస్తే.. ఆ నిధులతో ఈ పనులన్నీ చేశారు. సహజంగా ఇలాంటి పనులు చేసిన అధికారుల్ని ప్రశంసించాలి, ఊరి పెద్దల సమక్షంలో ఊరేగించాలి. కానీ ఇక్కడ మాత్రం వారిని దోషులుగా బోనులో నిలబెట్టారు. 20లక్షలతో అభివృద్ధి చేస్తే ఎందుకిలా చేస్తున్నారని అనుకుంటున్నారా..? అయితే ఈ చీటింగ్ స్టోరీ మీరే చదవండి..

దేశంలో ఏకైక ఫ్లోటింగ్‌ విలేజ్‌ అది. ఆ ఊరి పేరు చంపూఖాంగ్‌ పోక్‌. మణిపూర్ లో ఉంది. 400మంది జనాభా ఉంటారు. ఆ ఊరు నీటిపై తేలాడుతూ ఉన్నట్టు కనిపిస్తుంది. వెదురు బొంగులతో చేసిన ఇళ్లు, ప్రభుత్వ కార్యాలయాలు, స్కూల్స్ అక్కడ ఉంటాయి. అయితే ఊరు మొత్తం నీళ్లు ఉన్నా.. అధికారులు మాత్రం తారు రోడ్లు వేసినట్టు బిల్లులు పెట్టారు. అంతే కాదు, కాంక్రీట్ తో స్కూల్ బిల్డింగ్ కట్టినట్టు లెక్క చూపారు. చివరికి 120 మంది నకిలీ లబ్ధిదారుల పేర్లతో నిధులు స్వాహా చేశారు. ఇంత బరితెగించి, ఇప్పుడు ఆర్టీఐకి చిక్కారు. నీటిపై తేలాడే నగరంలో తారు రోడ్లు వేయడమేంటి అని.. మానవ హక్కుల కార్యకర్త రామ్ వాంగ్ ఖేరాక్ పామ్.. సమాచార హక్కు చట్టం ద్వారా వివరాలు సేకరించారు. ఏయే పనులకు ఎంతెంత ఖర్చు చేశారనే లెక్కలు తీశారు. ఒక్కసారిగా షాకయ్యారు. ఆ నిజానిజాలు గ్రామస్తులకు కూడా చెప్పారు. వారు కూడా నిర్ఘాంత పోయారు.

అవినీతి మేత..

ప్రధాన మంత్రి ఆదర్శ్ గ్రామ్ యోజన వంటి పేరుగొప్ప కార్యక్రమాలు క్షేత్రస్థాయిలో ఎలా అమలవుతున్నాయో తెలియజెప్పే ఉదాహరణ ఇది. ఈ కార్యక్రమం కోసం కేంద్రం గుడ్డిగా నిధులు విడుదల చేస్తోంది, అంతే గుడ్డిగా అధికారులు చెప్పే లెక్కలు విని, జమా ఖర్చులు రాసుకుంటోంది. అంతే కానీ, క్షేత్రస్థాయిలో ఆడిటింగ్ నిర్వహించడంలేదు. దీని ఫలితమే 20లక్షలు నీటిపాలు కావడం. సహజంగా అధికారులు ఇలాంటి పథకాల పేరుతో డబ్బులు వచ్చినప్పుడు ఐదో పదో వెనకేసుకుంటారు. కానీ ఇక్కడ వీరు డబ్బులన్నీ మింగేయాలనుకున్నారు. లేని రోడ్లు వేసినట్టు, లేని బిల్డింగ్ కట్టినట్టు లెక్కలు చెప్పి ఇప్పుడిలా అడ్డంగా బుక్కయ్యారు. అయితే అవినీతి అధికారుల్ని మణిపూర్ బీజేపీ సీఎం వెనకేసుకు రావడం విశేషం. నేతలు, అధికారులు.. ఆ నిధులతో పక్క గ్రామాల్లో అభివృద్ధి పనులు చేసి ఉంటారని అమాయకంగా చెబుతున్నారు సీఎం బీరేన్ సింగ్.

First Published:  8 Aug 2022 9:30 AM IST
Next Story