Telugu Global
National

మార్కెట్ లో ముందే రద్దయిన రూ.2వేల నోటు.. నెలాఖరు వరకు బ్యాంకుల్లో గడువు

ఈ కామర్స్ సంస్థ అమెజాన్ 2 వేల రూపాయల నోట్ల మార్పిడి విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. ఈనెల 19 నుంచి 2వేల నోట్లను తీసుకోవద్దని తమ డెలివరీ బాయ్స్ కి చెప్పింది.

మార్కెట్ లో ముందే రద్దయిన రూ.2వేల నోటు.. నెలాఖరు వరకు బ్యాంకుల్లో గడువు
X

రూ.2వేల నోట్లను ఉపసంహరించుకున్న ఆర్బీఐ, ఈ నెలాఖరు వరకు వాటిని బ్యాంకుల్లో మార్పిడి చేసుకోడానికి అవకాశం కల్పించింది. చాలామంది ఇప్పటికే ఆ పని పూర్తి చేశారు. కుప్పలు కుప్పలుగా పోగు చేసుకున్నవారు మాత్రం హడావిడి పడుతున్నారు. ఇక 2వేల నోటు ఉపసంహరణ ప్రకటన తర్వాత మార్కెట్లో ఆ నోట్లతో బిజినెస్ బాగా జరిగింది. ముఖ్యంగా గోల్డ్ మార్కెట్ లో 2వేల నోట్లు అనూహ్యంగా జమపడ్డాయి. ఇతరత్రా వస్తువుల కొనుగోలు సమయంలో కూడా 2వేల నోట్లు మార్పిడి చేసుకున్నారు బ్యాంకులకు వెళ్లడం ఇష్టం లేని కస్టమర్లు. అయితే ఇప్పుడు ఆ అవకాశం కూడా ఎవరికీ లేదు. మార్కెట్ లో ఎవరూ 2వేల నోట్లు తీసుకోవడంలేదు. అమెజాన్ లాంటి కంపెనీలు బహిరంగంగానే ప్రకటనలు చేస్తున్నాయి.

ఈ కామర్స్ సంస్థ అమెజాన్ 2 వేల రూపాయల నోట్ల మార్పిడి విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. ఈనెల 19 నుంచి 2వేల నోట్లను తీసుకోవద్దని తమ డెలివరీ బాయ్స్ కి చెప్పింది. క్యాష్ ఆన్ డెలివరీ సందర్భంలో కస్టమర్లు ఎవరైనా 2వేల నోట్లు ఇస్తే స్వీకరించొద్దని స్పష్టం చేసింది. ఈనెల 19నుంచి ఈ నియమాన్ని కచ్చితంగా పాటించాల్సిందేని చెప్పింది. పొరపాటున ఎవరైనా 2వేల నోట్లు తీసుకున్నా, సంస్థ మాత్రం వాటిని స్వీకరించబోదని తెలిపింది.

2వేల నోటుకి కాలం చెల్లినట్టు మే నెలలో ప్రకటించిన ఆర్బీఐ ఈనెల 30 వరకు బ్యాంకుల్లో మార్చుకోడానికి మాత్రం అవకాశం కల్పించింది. సెప్టెంబరు 1 నాటికి 90 శాతం నోట్లు తిరిగి బ్యాంకింగ్‌ వ్యవస్థలోకి వచ్చినట్లు ఆర్బీఐ గవర్నర్‌ తెలిపారు. వీటి విలువ రూ.3.32 లక్షల కోట్ల వరకు ఉంటుందని వెల్లడించారు. తిరిగొచ్చిన రూ.2,000 నోట్లలో 87 శాతం డిపాజిట్ల రూపంలోనే వచ్చినట్లు చెప్పారు. గడువు సమీపిస్తున్న దశలో మిగిలిన నోట్లు కూడా బ్యాంకులకు చేరుకుంటున్నాయి. అయితే వ్యాపార వర్గాలు మాత్రం ముందుగానే నోట్లను స్వీకరించడం మానేశాయి.

First Published:  14 Sept 2023 7:01 PM IST
Next Story