Telugu Global
National

పార్లమెంట్ ప్రారంభోత్సవానికి 19 పార్టీలు దూరం

సావర్కార్ జయంతి రోజున పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవం దేనికి సంకేతం అనే విమర్శలు వినపడుతున్నాయి. మొత్తం 19 పార్టీలు ఉమ్మడి లేఖలో కేంద్రంపై మండిపడ్డాయి.

పార్లమెంట్ ప్రారంభోత్సవానికి 19 పార్టీలు దూరం
X

ఒకటీ రెండు కాదు, మొత్తం 19 రాజకీయ పార్టీలు పార్లమెంట్ నూతన భవన ప్రారంభోత్సవానికి దూరంగా ఉంటున్నట్టు ప్రకటించాయి. ఈనెల 28న పార్లమెంట్ నూతన భవనాన్ని ప్రధాని నరేంద్రమోదీ ప్రారంభించాల్సి ఉంది. మహూర్తం దగ్గరపడేకొద్దీ ఈ కార్యక్రమాన్ని బాయ్ కాట్ చేస్తున్న పార్టీల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటి వరకు 19పార్టీల ప్రతినిధులు తమ నిర్ణయాన్ని తెలిపారు. మోదీ చేసే ప్రారంభోత్సవానికి తాము రాలేమంటున్నారు. ఈమేరకు ఓ ఉమ్మడి ప్రకటన విడుదల చేశారు. కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ, తృణమూల్ కాంగ్రెస్, డీఎంకే, ఆర్జేడీ, జేడీయూ, ఎన్సీపీ, ఉద్ధవ్ సేన, కమ్యూనిస్ట్ పార్టీలు సహా.. మొత్తం 19 పార్టీలు ఉమ్మడి లేఖలో కేంద్రంపై మండిపడ్డాయి.

కారణం ఏంటి..?

పార్లమెంట్‌ భవనాన్ని ప్రధాని మోదీ తన చేతుల మీదుగా ప్రారంభించాలనుకోవడాన్ని విపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. రాష్ట్రపతితో ఈ భవనాన్ని ప్రారంభించాలని ప్రతిపక్షాలు డిమాండ్‌ చేస్తున్నాయి. అంతే కాదు.. సావర్కార్ జయంతి రోజున పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవం దేనికి సంకేతం అనే విమర్శలు వినపడుతున్నాయి. రాష్ట్రపతి ద్రౌపది ముర్ముని పూర్తిగా పక్కన పెట్టి కొత్త పార్లమెంట్‌ భవనాన్ని తానే స్వయంగా ప్రారంభించాలనుకున్న మోదీ నిర్ణయం ప్రజాస్వామ్యానికి తీవ్ర అవమానమని తెలిపాయి విపక్షాలు. ఈ చర్య రాష్ట్రపతి అత్యున్నత పదవిని, రాజ్యంగ స్పూర్తిని వ్యతిరేకించినట్టేనని, రాష్ట్రపతిగా ఎన్నికైన తొలి ఆదివాసీ మహిళా గౌరవాన్ని దెబ్బతీయడమే అవుతుందని ప్రతిపక్షాలు తమ ప్రకటనలో పేర్కొన్నాయి.

మేం పిలిచాం.. మీ ఇష్టం..

విపక్షాల ఉమ్మడి ప్రకటనపై హోం మంత్రి అమిత్‌ షా స్పందించారు. పార్లమెంట్‌ నూతన భవన ప్రారంభోత్సవానికి అన్ని పార్టీలను ఆహ్వానించామని తెలిపారు. ఉభయ సభల ఎంపీలకు, అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల సీఎంలకు.. ఇతర నేతలకు భౌతికంగా ఆహ్వానాలు పంపామని, డిజిటల్ రూపంలో కూడా వాటిని పంపించామని చెప్పారు. పార్లమెంట్ ప్రారంభోత్సవానికి రావడం, రాకపోవడంపై నిర్ణయం వారి విజ్ఙతకే వదిలేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమాన్ని బాయ్ కాట్ చేస్తున్న విపక్షాలు పునరాలోచించుకోవాలని సూచించారు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్‌ జోషి.

First Published:  24 May 2023 3:49 PM IST
Next Story