యూపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. 18 మంది మృతి
ఉత్తరప్రదేశ్‌లో బుధవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఉన్నావ్ పట్టణంలో ఓ పాల ట్యాంకర్‌ను డబుల్ డెక్కర్ బస్సు ఢీకొట్టింది.
ఉత్తరప్రదేశ్‌లో బుధవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఉన్నావ్ పట్టణంలో ఓ పాల ట్యాంకర్‌ను డబుల్ డెక్కర్ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సులో ఉన్న 18 మంది ప్రయాణికులు దుర్మరణం పాలయ్యారు. మరో 30 మందికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
ఉదయం 5.15 గంటల సమయంలో లక్నో-ఆగ్రా ఎక్స్‌ప్రెస్‌వేపై ఓ పాల ట్యాంకర్‌ను డబుల్ డెక్కర్ బస్సు పాల కంటైనర్‌ను వెనుక నుంచి ఢీ కొట్టింది. దీంతో బస్ మొత్తం కంటైనర్‌లోకి దూసుకెళ్లడంతో ఘోరం జరిగిపోయింది. బస్సు బీహార్‌లోని సీతామర్హి నుంచి ఢిల్లీ వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాద సమయంలో బస్సు రెండు పల్టీలు కొట్టి ముక్కలైందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.
స్థానికుల నుంచి సమాచారం అందుకున్న ఉన్నావ్ పోలీసులు, ఉన్నత అధికారులు హుటాహుటిన ఘటనా ప్రాంతానికి చేరుకున్నారు. బస్సులో ఉన్న క్షతగాత్రులను బయటికి తీసి సమీపంలోని బంగార్‌మావ్ సీహెచ్‌సీ కి చికిత్స నిమిత్తం తరలించారు.
బెహతా ముజావర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గర్హా గ్రామం వద్ద ఈ ప్రమాదం జరిగింది. మృతదేహాలను పోస్టుమార్టానికి తరలించారు. మృతులలో 14 మంది పురుషులు, ముగ్గురు మహిళలు, ఒక చిన్నారి ఉన్నారు. యూపీ రవాణా మంత్రి దయాశంకర్‌సింగ్, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రమాదంపై విచారం వ్యక్తం చేశారు. గాయపడిన వారికి సరైన చికిత్స అందించాలని అధికారులను ఆదేశించారు.