తండ్రి స్నాప్‌చాట్ డౌన్లోడ్ వద్దన్నాడని బాలిక సూసైడ్
ప్రముఖ మెసేజింగ్ యాప్ స్నాన్‌చాట్‌ను వాడొద్దని తండ్రి మందలించినందుకు 16 ఏళ్ల బాలిక ఆత్మహత్యకు పాల్పడింది.
సోషల్ మీడియా పిచ్చి ఓ ప్రాణాన్ని బలి తీసుకుంది. ప్రముఖ మెసేజింగ్ యాప్ స్నాన్‌చాట్‌ను వాడొద్దని తండ్రి మందలించినందుకు 16 ఏళ్ల బాలిక ఆత్మహత్యకు పాల్పడింది. తన భవిష్యత్తు గురించి ఆలోచించే తండ్రి ఆ మాట చెప్పాడని కూడా తెలుసుకోలేని బాలిక కన్న తండ్రికి గుండె కోత మిగిల్చింది.
ఇటీవలే కాలంలో యువత చిన్న చిన్న విషయాలకే కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నారు. పరీక్షల్లో ఫెయిల్ అయ్యామని, తల్లిదండ్రులు మందలించారని, ఫోన్ కొనియ్యలేదని చివరికి స్నేహితులు ఏదో మాట అన్నారని కూడా ఆత్మహత్య చేసుకున్నవారు కూడా ఉన్నారు. ఇలాంటి ఘటనే జరిగింది మహారాష్ట్రలో.
థానే జిల్లా డోంబివాలి ప్రాంతంలోని నీల్జేలో నివాసముంటున్న ఓ తండ్రి తన 16 ఏళ్ల కుమార్తెకు ఫోన్ కొనిచ్చారు. కానీ అదే అతను చేసిన పెద్ద తప్పు అయిపోయింది. కుమార్తె అడిగిందని ఫోన్ అయితే కొనిచ్చాడు కానీ ఆ మొబైల్ ఫోన్‌లో ‘స్నాప్‌చాట్’ డౌన్‌లోడ్ చేసుకోవడానికి మాత్రం ససేమిరా అన్నాడు. అయితే అప్పటికే ఆ అమ్మాయి తన మొబైల్ ఫోన్‌లో స్నాప్‌చాట్ యాప్ డౌన్‌లోడ్ చేసినట్లు గుర్తించిన తండ్రి మరో రెండుసార్లు కాస్త గట్టిగా మందలించాడు. తండ్రి మాటలకు ఆగ్రహానికి గురైన బాలిక క్షణికావేశంలో కఠిన నిర్ణయం తీసుకుంది. శుక్రవారం రాత్రి తన ఇంట్లోని ఓ గదిలో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.
మరుసటి రోజు ఎంతకీ బాలిక బయటకు రాకపోవడంతో వచ్చిన కుటుంబ సభ్యులు డోర్లను పగలగొట్టి లోపలికి వెళ్ళగా తాడుకి వేలాడుతున్న బాలిక మృతదేహాన్నిచూసి కన్నీరుమున్నీరయ్యారు. ఘటనపై సమాచారం అందుకున్న మాన్‌పాడ స్టేషన్ పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.