ఎక్స్‌ప్రెస్ హైవే పనుల్లో ఘోర ప్రమాదం.. - 14 మంది కార్మికులు మృతి
రోడ్డు పనుల్లో భాగంగా వంతెన నిర్మిస్తుండగా.. పిల్లర్లతో అనుసంధానించే గిర్డర్ యంత్రం ఒక్కసారిగా కుప్పకూలింది. అది కార్మికులపై పడటంతో చాలామంది ప్రమాద స్థలిలోనే మృతిచెందారు.
మహారాష్ట్రలో కొనసాగుతున్న సమృద్ధి ఎక్స్‌ప్రెస్ హైవే ఫేజ్-3 పనుల్లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. గిర్డర్ యంత్రం కుప్పకూలి 14 మంది కార్మికులు మృతిచెందారు. పలువురు గాయపడ్డారు. థానే జిల్లాలోని షాపూర్‌లో మంగళవారం తెల్లవారు జామున ఈ ఘటన జరిగింది. రోడ్డు పనుల్లో భాగంగా వంతెన నిర్మిస్తుండగా.. పిల్లర్లతో అనుసంధానించే గిర్డర్ యంత్రం ఒక్కసారిగా కుప్పకూలింది. అది కార్మికులపై పడటంతో చాలామంది ప్రమాద స్థలిలోనే మృతిచెందారు. దాదాపు 100 అడుగుల ఎత్తు నుంచి ఈ యంత్రం పడిపోయినట్టు సమాచారం.
గాయపడినవారిని చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయ చర్యలు చేపట్టారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనలో పలువురు తీవ్రంగా గాయపడ్డారని, మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని సమాచారం.