పూరీ ఆలయ ఉత్సవాల్లో అపశ్రుతి - బాణసంచా పేలి 15 మందికి తీవ్ర గాయాలు
జగన్నాథుడి ఆలయ ఉత్సవాల్లో పేలుడు సంభవించడంపై రాష్ట్ర ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ విచారం వ్యక్తం చేశారు. గాయపడ్డవారికి మెరుగైన వైద్యం అందించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
ఒడిశాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం పూరీ ఆలయ ఉత్సవాల్లో అపశ్రుతి చోటుచేసుకుంది. బాణసంచా పేలి నిప్పురవ్వలు ఎగసిపడటంతో 15 మంది భక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. పూరీలో బుధవారం రాత్రి ఆలయం వద్ద ఉన్న నరేంద్ర పుష్కరిణిలో జగన్నాథుడి చందన ఉత్సవం నిర్వహించారు. ఆ సమయంలో కొందరు భక్తులు బాణసంచా పేల్చుతుండగా నిప్పు రవ్వలు ఎగసిపడి నిల్వ ఉన్న బాణసంచా ప్రాంతంలో పడ్డాయి.
దీంతో ఒక్కసారిగా పేలుడు సంభవించి నిప్పురవ్వలు భారీగా ఎగసిపడ్డాయి. స్వామివారి చందన ఉత్సవానికి వందలాది మంది భక్తులు తరలిరాగా.. వారిపై ఈ నిప్పురవ్వలు పడ్డాయి. దీంతో భయాందోళన చెందిన భక్తులు అక్కడి నుంచి పరుగులు తీశారు. కొందరు భక్తులు తమ ప్రాణాలు కాపాడుకోవడానికి పక్కనే ఉన్న ఆలయ పుష్కరిణిలో దూకారు.
ఈ ప్రమాదంలో మొత్తం 15 మంది భక్తులకు కాలిన గాయాలయ్యాయి. గాయపడ్డ భక్తులను జిల్లా ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు ప్రకటించారు. జగన్నాథుడి ఆలయ ఉత్సవాల్లో పేలుడు సంభవించడంపై రాష్ట్ర ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ విచారం వ్యక్తం చేశారు. గాయపడ్డవారికి మెరుగైన వైద్యం అందించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. చికిత్సకు అయ్యే ఖర్చు మొత్తం ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి భరిస్తామని నవీన్ పట్నాయక్ తెలిపారు.