Telugu Global
National

ప్రియుడితో ఉండగా చూసిందని..చెల్లిని దారుణంగా హతమార్చిన అక్క

పోలీసులు ముందు మిస్సింగ్ కేసు నమోదు చేసుకొని బాలిక ఆచూకీ కోసం గాలించారు. మే 19వ తేదీన పొలంలో బాలిక మృతదేహం గుర్తించారు. ఆ తర్వాత పోలీసులు మిస్సింగ్ కేసును హత్య కేసుగా మార్చి దర్యాప్తు చేపట్టారు.

ప్రియుడితో ఉండగా చూసిందని..చెల్లిని దారుణంగా హతమార్చిన అక్క
X

బీహార్ రాష్ట్రంలో దారుణ సంఘటన జరిగింది. ప్రియుడితో సన్నిహితంగా ఉన్న సమయంలో చూసిందని చెల్లిని సొంత అక్కే దారుణంగా హతమార్చింది. చేతి వేళ్లను నరికి.. ముఖాన్ని యాసిడ్ తో కాల్చేసింది. ఈ సంఘటన మే 15వ తేదీన జరగగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వైశాలి జిల్లా హరప్రసాద్ గ్రామానికి చెందిన బాలికల తల్లిదండ్రులు ఓ పెళ్లి వేడుకకు హాజరయ్యేందుకు ఈనెల 15వ తేదీన బంధువుల ఊరికి వెళ్లారు.

దీన్ని అవకాశంగా తీసుకున్న వారి 13 ఏళ్ల పెద్ద కుమార్తె తన ప్రియుడు(18)ని కలవడానికి వెళ్ళింది. అయితే ఆ బాలిక ప్రియుడితో సన్నిహితంగా ఉన్న సమయంలో.. హఠాత్తుగా అక్కడికి బాలిక చెల్లెలు (9) వచ్చింది. చెల్లెలు విషయాన్ని ఇంట్లో చెబుతుందని అక్క భయపడింది. ఆమెను చంపేయాలని నిర్ణయించుకుంది. ప్రియుడితోపాటు అత్త సహాయం తీసుకుని బాలికను దారుణంగా హత్య చేసింది.

ఆ తర్వాత ఆమె చేతి వేళ్లను నరికింది. ముఖాన్ని ఎవరూ గుర్తుపట్టకూడదని యాసిడ్ తో కాల్చింది. మృతదేహాన్ని ఇంటి వెనుక ఉన్న పొలాల్లో పడేసి ఏమీ ఎరగనట్టు ఇంటికి వెళ్ళింది. పెళ్లి వేడుకలు ముగిసిన తర్వాత తల్లిదండ్రులు ఇంటికి వచ్చారు. చిన్న కుమార్తె కనిపించడం లేదని తెలుసుకొని ఆమె ఆచూకీ కోసం వెతికారు. ఆ తర్వాత జండాహా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.

పోలీసులు ముందు మిస్సింగ్ కేసు నమోదు చేసుకొని బాలిక ఆచూకీ కోసం గాలించారు. మే 19వ తేదీన పొలంలో బాలిక మృతదేహం గుర్తించారు. ఆ తర్వాత పోలీసులు మిస్సింగ్ కేసును హత్య కేసుగా మార్చి దర్యాప్తు చేపట్టారు. తల్లిదండ్రులు ఊరికి వెళ్ళిన సమయంలో చెల్లెలు ఎక్కడెక్కడికి వెళ్ళింది.. అని అక్క వద్ద పోలీసులు వివరాలు తెలుసుకున్నారు. అయితే ఆమె తీరు అనుమానాస్పదంగా ఉండటంతో బాలిక సెల్ ఫోన్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాత విచారణలో తానే తన ప్రియుడి సహాయంతో చెల్లిని హత్య చేసినట్లు అక్క అంగీకరించింది. ఈ కేసులో మైనర్ బాలికను బాలికా సుధార్ గ్రహ్ కు తరలించారు. 18 ఏళ్ల యువకుడు, వారికి సహకరించిన మహిళను పోలీసులు అరెస్టు చేశారు.

First Published:  25 May 2023 6:49 PM IST
Next Story