తమిళనాడు బీజేపీకి షాక్... 13 మంది నాయకుల రాజీనామా, AIADMK లో చేరిక
చెన్నై వెస్ట్‌లోని బిజెపి ఐటి విభాగం జిల్లా అధ్యక్షుడు అన్బరసన్ తో సహా 10 మంది ఐటీ వింగ్ జిల్లా కార్యదర్శులు, ఇద్దరు ఐటీ వింగ్ జిల్లా ఉప కార్యదర్శులు రాజీనామాలు చేసినవారిలో ఉన్నారు. బీజేపీ రాష్ట్ర ఐటీ విభాగం చీఫ్ నిర్మల్ కుమార్ ఏఐఏడీఎంకేలోకి వెళ్లిన కొద్ది రోజులకే ఈ రాజీనామాల పర్వం మొదలయ్యింది.
తమిళనాడు బీజేపీకి షాక్ తగిలింది. ఈ రోజు 13 మంది నాయకులు ఆ పార్టీకి రాజీనామా చేశారు. మంగళవారం ఎడప్పాడి కె. పళనిస్వామితో సమావేశమైన అనంతరం బిజెపి మేధో విభాగం రాష్ట్ర కార్యదర్శి కృష్ణన్, ఐటి విభాగం రాష్ట్ర కార్యదర్శి దిలీప్ కన్నన్, తిరుచ్చి రూరల్ జిల్లా ఉపాధ్యక్షుడు విజయ్, రాష్ట్ర ఒబిసి విభాగం కార్యదర్శి అమ్ము అన్నాడీఎంకేలో చేరిన నేపథ్యంలో ఈ రోజు ఈ 13 మంది బీజేపీకి రాజీనామాలు చేశారు. వీరంతా AIADMK లో చేరారు.
చెన్నై వెస్ట్‌లోని బిజెపి ఐటి విభాగం జిల్లా అధ్యక్షుడు అన్బరసన్ తో సహా 10 మంది ఐటీ వింగ్ జిల్లా కార్యదర్శులు, ఇద్దరు ఐటీ వింగ్ జిల్లా ఉప కార్యదర్శులు రాజీనామాలు చేసినవారిలో ఉన్నారు. బీజేపీ రాష్ట్ర ఐటీ విభాగం చీఫ్ నిర్మల్ కుమార్ ఏఐఏడీఎంకేలోకి వెళ్లిన కొద్ది రోజులకే ఈ రాజీనామాల పర్వం మొదలయ్యింది.
రాజీనామాలు చేసినవారంతా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలైపై తీవ్ర అసంత్రుప్తిగా ఉన్నారు. తమందరిపై అన్నామలై నిఘా పెట్టాడని వీరు ఆరోపించారు.
బీజేపీ ఐటీ విభాగం చెన్నై వెస్ట్ జిల్లా అధ్యక్షుడు అన్బరసన్ ఒక ప్రకటనలో .. ‘‘నేను బీజేపీ కోసం ఏళ్ల తరబడి పనిచేశాను. నేనెప్పుడూ ఎలాంటి పదవి ఆశించలేదని ప్రజలకు తెలుసు. గత కొద్ది రోజులుగా పార్టీలో నెలకొన్న అసాధారణ పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని పార్టీకి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నాను.'' అని అన్నారు.
కాగా, తమ పార్టీకి రాజీనామా చేసిన వారిని AIADMK తమ పార్టీలో చేర్చుకోవడం కూటమి నీతిని విస్మరించడమే అని బీజేపీ నాయకులు విమర్శించారు. ద్రవిడరాజకీయాలు నడిపే రాజకీయ పార్టీలు బీజేపీలోని నాయకులను చేర్చుకోవడం బీజేపీ బలానికి నిదర్శనమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై అన్నారు.
ఒంటరిగా పోటీ చేసినప్పుడు బీజేపీ అభ్యర్థులకు నోటాకన్నా తక్కువ ఓట్లు వచ్చాయన్న విషయం మర్చిపోతున్నారని ఏఐఏడీఎంకే ఐటీ విభాగం కార్యదర్శి సింగై రామచంద్రన్ ట్వీట్ చేశారు.