Telugu Global
National

మతపరమైన నినాదాలు చేయలేదని బాలుడి బట్టలిప్పి కొట్టిన వైనం

ఇండోర్ నగరం స్టార్ స్క్వేర్ సమీపంలో 12 ఏళ్ల ఓ బాలుడు ఆడుకుంటున్నాడు. ఆ సమయంలో అక్కడికి నిందితుల్లో ఒక వ్యక్తి వచ్చాడు. బాలుడిని మహాలక్ష్మి నగర్ ప్రాంతంలోని ఫ్లై ఓవర్ వద్దకు తీసుకువెళ్లాడు.

మతపరమైన నినాదాలు చేయలేదని బాలుడి బట్టలిప్పి కొట్టిన వైనం
X

మధ్యప్రదేశ్ రాష్ట్రం ఇండోర్ నగరంలో దారుణ సంఘటన జరిగింది. మతపరమైన నినాదాలు చేయాలని 12 సంవత్సరాల బాలుడిని బలవంతపెట్టిన ఇద్దరు వ్యక్తులు అలా చేయలేదని.. బాలుడి దుస్తులు విప్పి దాడి చేశారు. అంతటితో ఆగకుండా వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అయితే బాలుడిపై దాడికి పాల్పడ్డ ఇద్దరు వ్యక్తులు కూడా మైనర్లే కావడం కలకలం సృష్టిస్తోంది. ఈ వీడియోలు ప్రస్తుతం వైరల్ కావడంతో తాజాగా పోలీసులు కేసు నమోదు చేశారు. ఇందులో ప్రమేయం ఉన్న ఇద్దరు మైనర్లను అదుపులోకి తీసుకున్నట్లు ఇండోర్ పోలీసులు తెలిపారు.

ఇండోర్ నగరం స్టార్ స్క్వేర్ సమీపంలో 12 ఏళ్ల ఓ బాలుడు ఆడుకుంటున్నాడు. ఆ సమయంలో అక్కడికి నిందితుల్లో ఒక వ్యక్తి వచ్చాడు. బాలుడిని మహాలక్ష్మి నగర్ ప్రాంతంలోని ఫ్లై ఓవర్ వద్దకు తీసుకువెళ్లాడు. అక్కడ నిందితుడికి మరో వ్యక్తి తోడయ్యాడు. ఆ ఇద్దరు వ్యక్తులు సదరు బాలుడిని మతపరమైన నినాదాలు చేయాలని బలవంతం చేశారు. ఎంత చెప్పినా బాలుడు వినకపోవడంతో దుస్తులు విప్పించారు. అప్పటికీ బాలుడు నినాదాలు చేయకపోవడంతో అతడిపై దాడి చేశారు.

బాలుడిపై దాడి చేస్తున్న సమయంలో వీడియోలు తీశారు. ఆ ఇద్దరు వ్యక్తుల నుంచి ఎలాగోలా తప్పించుకున్న బాలుడు ఇంటికి వెళ్లి విషయాన్ని తల్లిదండ్రులకు తెలిపాడు. వారు ఈ సంఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఈ కేసు గురించి ఇండోర్ పోలీసులు మాట్లాడుతూ... దాడికి గురైన బాలుడికి నిందితులు ఇదివరకే తెలుసు అని చెప్పారు. నిందితులను ఇప్పటికే అదుపులోకి తీసుకున్నామని చెప్పారు. సంబంధిత సెక్షన్ల కింద కేసులు నమోదు చేశామని వివరించారు. నిందితులు, బాధితుడు మైనర్లే కాబట్టి ఈ సంఘటనకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో వైరల్ చేయవద్దని పోలీసులు ప్రజలను కోరారు. నిందితులు ఇటువంటి చర్యకు ఎందుకు పాల్పడ్డారో ఆరా తీస్తున్నామని, తదుపరి విచారణ కొనసాగుతుందని పోలీసులు తెలిపారు.

First Published:  14 April 2023 6:02 PM IST
Next Story