12 మందిని బలి తీసుకున్న పొగ మంచు
జలాలాబాద్ నుంచి ప్రయాణికులతో వెళ్తున్న ఆటోను ఎదురుగా రాంగ్ రూట్‌లో వచ్చిన ట్యాంకర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న 12 మంది అక్కడికక్కడే మరణించారు.
పొగ మంచు కారణంగా జరిగిన రోడ్డు ప్రమాదంలో 12 మంది మృతిచెందారు. ఆటోలో ప్రయాణిస్తున్నవారంతా ఈ ఘటనలో ప్రాణాలొదిలారు. రాంగ్‌రూట్‌లో వచ్చిన ట్యాంకర్ ఆటోను ఢీకొట్టడంతో ఈ ఘటన జరిగింది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం షాజహాన్ పుర్ జిల్లాలోని బరేలీ–ఫరూఖాబాద్ రహదారిపై ఈ ఘటన జరిగింది. గురువారం తెల్లవారుజామున ఈ ఘటన చోటుచేసుకుందని, ప్రమాదం జరిగిన సమయంలో పొగ మంచు ఎక్కువగా కురుస్తోందని, అది కూడా ఈ ప్రమాదం కారణమని పోలీసులు వెల్లడించారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జలాలాబాద్ నుంచి ప్రయాణికులతో వెళ్తున్న ఆటోను ఎదురుగా రాంగ్ రూట్‌లో వచ్చిన ట్యాంకర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న 12 మంది అక్కడికక్కడే మరణించారు. మృతుల్లో మహిళలు, చిన్నారులు ఉన్నారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.