బస్సు లోయలో పడి 10 మంది యాత్రికుల మృతి
బస్సు ప్రమాదాన్ని గుర్తించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారమిచ్చారు. వారు ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాద సమయంలో బస్సులో దాదాపు 75 మంది ఉన్నట్టు సమాచారం.
మాతా వైష్ణోదేవి ఆలయానికి వెళుతున్న యాత్రికుల బస్సు లోయలో పడి 10 మంది మృతిచెందారు. మరో 55 మంది గాయపడ్డారు. మంగళవారం తెల్లవారుజామున జమ్మూ కశ్మీర్‌లో ఈ ఘోరం జరిగింది. అక్కడి అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. పంజాబ్‌లోని అమృత్‌సర్ నుంచి యాత్రికులు బస్సులో వెళుతుండగా ఈ ఘటన జరిగింది.
యాత్రికుల బస్సు వైష్ణోదేవి ఆలయ బేస్ క్యాంప్ అయిన కత్రాకు వెళ్తుండగా.. మార్గమధ్యలో ఝజ్జర్ కొట్టి ప్రాంతంలో జమ్మూ-శ్రీనగర్ హైవేపై అదుపుతప్పింది. రోడ్డుపై నుంచి జారి లోయలో పడిపోయింది. కత్రా బేస్ క్యాంపునకు 15 కిలోమీటర్ల దూరంలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. మరికొద్దిసేపట్లో గమ్యస్థానాన్ని చేరాల్సిన వారు ఊహించని ప్రమాదానికి గురయ్యారు.
బస్సు ప్రమాదాన్ని గుర్తించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారమిచ్చారు. వారు ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాద సమయంలో బస్సులో దాదాపు 75 మంది ఉన్నట్టు సమాచారం. ఈ ఘటనలో 10 మంది యాత్రికులు అక్కడికక్కడే మృతిచెందగా, మరో 55 మంది గాయపడ్డారు. ప్రస్తుతం బస్సు నుంచి అందరినీ వెలికితీసినట్లు జమ్మూ ఎస్పీ చందన్ కోహ్లి తెలిపారు. ఈ ప్రమాదంపై జమ్మూకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.