ఇక్కడా అతివేగమే.. కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం.. పదిమంది మృతి
ఈ ప్రమాదంలో ఇద్దరు చిన్నారులు సహా 10 మంది అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మరి కొంతమంది గాయపడగా వారిని చికిత్స కోసం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.
వారంతా ఒకే కుటుంబానికి చెందినవారు. మైసూర్ నగరంలోని అందాలను తిలకించాలని కారులో బయలుదేరారు. పిల్లలు, పెద్దలు ముచ్చట్లు చెప్పుకొంటున్నారు. ఇంకొంతసేపు ప్రయాణిస్తే మైసూర్ కు చేరుకుంటారు. అయితే మృత్యువులా దూసుకొచ్చిన ఓ ప్రైవేట్ బస్సు వారి బతుకులను ఛిద్రం చేసింది. బస్సు కారును ఢీకొనడంతో కారు నుజ్జునుజ్జు కాగా, అందులోని పదిమంది దుర్మరణం చెందారు. మరి కొంతమంది తీవ్రంగా గాయపడ్డారు.
కర్ణాటక రాష్ట్రం బళ్లారికి చెందిన ఓ కుటుంబం మైసూర్ ను సందర్శించేందుకు ఇన్నోవా కారులో బయలుదేరింది. వాహనంలో మొత్తం పదిమందికి పైగా ఉన్నారు. వీరు ప్రయాణిస్తున్న వాహనాన్ని మైసూరు జిల్లాలోని టి. నరసిపూర్ వద్ద అతివేగంగా వచ్చిన ఓ ప్రైవేట్ బస్సు ఢీకొంది. బస్సు ఢీకొన్న దాటికి కారు నుజ్జునుజ్జు అయ్యింది. మృతదేహాలు వాహనంలో ఇరుక్కుపోయాయి.
ఈ ప్రమాదంలో ఇద్దరు చిన్నారులు సహా 10 మంది అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మరి కొంతమంది గాయపడగా వారిని చికిత్స కోసం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. వీరిలో కూడా కొందరి పరిస్థితి విషమంగా ఉంది. కాగా, బస్సులో ప్రయాణిస్తున్న వారి పరిస్థితిపై స్పష్టత రావాల్సి ఉంది. ప్రమాద స్థలి వద్దకు చేరుకున్న పోలీసులు సహాయ చర్యలు చేపట్టారు.
ఉదయం అస్సోంలో.. ఇప్పుడు కర్ణాటకలో..
ఇవాళ ఉదయం అస్సోం రాష్ట్రం గువాహటిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏడుగురు ఇంజినీరింగ్ విద్యార్థులు చనిపోయారు. అతివేగంగా ప్రయాణిస్తున్న కారు వేగాన్ని నియంత్రించుకోలేక రోడ్డు డివైడర్ ను ఢీకొని ఆ తర్వాత ఎదురుగా వచ్చిన వ్యాన్ ను ఢీకొంది. మైసూర్ ఘటనలోనూ ప్రైవేట్ బస్సు అతివేగం వల్ల ప్రమాదం జరిగింది. ఈ రెండు సంఘటనల్లో అతివేగం 17 మంది ప్రాణాలను బలిగొంది.